పెద్ద నోట్లపై రోజా సినిమా షూటింగ్ అంట‌!

పెద్ద నోట్లపై రోజా సినిమా షూటింగ్ అంట‌!

పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీపై ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో తెలుగుత‌మ్ముళ్లు సైతం జోరుగా స్పందించ‌డం ప్రారంభించింది. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ర్ల రామ‌య్య ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. నోట్ల ర‌ద్దును ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మ‌ర్థిస్తే దాన్ని వైసీపీ నేత‌లు త‌ప్పుప‌ట్ట‌డం ఏమిట‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని విమ‌ర్శిస్తే ఎక్క‌డ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుందోన‌ని చంద్ర‌బాబును అంటున్నార‌ని వ‌ర్ల‌ ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్భంగా బ్యాంకు వ‌ద్ద వినియోగ‌దారుల‌తో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ముచ్చ‌టించిన తీరుపైనా వ‌ర్ల రామ‌య్య కొత్త భాష్యాలు చెప్పారు.

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వంపై తీసుకున్న నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ బ్యాంకు వ‌ద్దకు వెళ్ల‌టాన్ని డ్రామాగా వ‌ర్ణించిన తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ర్ల రామ‌య్య... రాష్ట్రంలో చిత్తూరులో బ్యాంకు వ‌ద్ద రోజా సినిమా తీశార‌ని ఎద్దేవా చేశారు. పెద్ద కాంగ్రెస్‌, చిన్న కాంగ్రెస్‌ల సినిమాలు-డ్రామాలు ఒక్క‌టేన‌ని తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టినుంచో చెప్తుంద‌ని దానికి ఇదే రుజువు అని విశ్లేషించారు. త‌ల్లికాంగ్రెస్ గూటికి పిల్ల కాంగ్రెస్ అయిన వైఎస్ఆర్సీపీ చేర‌డం ఎప్పటికైనా త‌ప్ప‌ద‌న‌డానికి ఇదే రుజువ‌ని వ‌ర్ల రామ‌య్య జోస్యం చెప్పారు. న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పట్నుంచి తాము పోరాడుతునే ఉన్నామ‌ని వ‌ర్ల చెప్పారు. 2008లో రాజా ఆఫ్ కరెప్ష‌న్ పుస్తకం వేసినరోజే రాష్ట్రపతి, ఎలక్షన్ కమిషనర్, సివిసి, తదితర రాజ్యాంగ అధిపతులు అందరినీ కలిసినప్పుడే చెప్పామ‌న్నారు. అవినీతిపై/నల్లధనంపై పోరాటం గురించి, పెద్దనోట్ల వల్ల దుష్ఫలితాల గురించివివ‌రించిన‌ట్లు తెలిపారు.

మ‌రోవైపు తాజా నిర్ణ‌యానికి కార‌ణ‌మైన ముంబైకు చెందిన అర్థక్రాంతి ప్రతిష్టాన్ తో త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎప్పుడో స‌మావేశ‌మ‌య్యార‌ని వ‌ర్ల రామ‌య్య వివ‌రించారు. అర్థ‌క్రాంతి చైర్మన్ అనిల్ బొకలే, సభ్యులు అతుల్దేశ్ ముఖ్, లీల, తదితరులతో హైదరాబాద్ లో చంద్రబాబుతో 2013లోనే భేటీ అయ్యారని తెలిపారు. నల్లధనం అరికట్టడానికి, అవినీతిని అంతం చేయడానికి పెద్దనోట్ల రద్దే పరిష్కారంగా అర్థక్రాంతి ప్రతిష్టాన్ చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిందని తెలిపారు. దేశం మొత్తాన్ని కుదిపివేస్తున్న ఇంత పెద్ద నిర్ణ‌యం వెలువ‌డిన‌ప్ప‌టికీ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం స్పందించ‌డం లేద‌ని వ‌ర్ల రామ‌య్య త‌ప్పుప‌ట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు