అమ్మ భాష నేర్చుకుంటున్న త‌మ్మూ

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తెలుగు మాట్లాడే తీరు చూస్తే త‌ను నిజంగా ఉత్త‌రాది అమ్మాయేనా అని ఆశ్చర్యం క‌లుగుతుంది. చాలామంది తెలుగు అమ్మాయిల కంటే కూడా స్వ‌చ్ఛంగా మ‌న భాష‌లో మాట్లాడుతుంది మిల్కీ బ్యూటీ. కొన్ని సినిమాల్లో త‌నే స్వ‌యంగా తెలుగులో డ‌బ్బింగ్ కూడా చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం తెలుగే కాదు.. ఆమెకు త‌మిళం కూడా బాగా వ‌చ్చు. అన‌ర్గ‌ళంగా మాట్లాడేస్తుంది. నార్త్ అమ్మాయి కాబ‌ట్టి హిందీ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇంగ్లిష్‌లోనూ అద‌ర‌గొట్టేస్తుంది. కానీ ఇన్ని భాష‌లు వ‌చ్చినా త‌మ‌ మాతృ భాష సింధి మాత్రం త‌న‌కు స‌రిగా రాద‌ని అంటోంది త‌మ్మూ. త‌న త‌ల్లిదండ్రుల భాష సింధినే అని.. వాళ్లు ఇంట్లో ఆ భాష‌లోనే మాట్లాడుకుంటార‌ని.. కానీ త‌న‌కు మాత్రం ఆ భాషపై ప‌ట్టులేద‌ని ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

లాక్ డౌన్ టైంలో ఆ భాష‌పై ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు త‌మ‌న్నా వెల్ల‌డించింది. మా అమ్మ నుంచి చాలా విష‌యాలు నేర్చుకోవాల‌ని ఉండేది. వాళ్ల ప‌రిజ్ఞానం, నైపుణ్యం త‌ర్వాతి త‌రాల‌కు అందించాలి. కానీ సినిమాల‌తో తీరిక దొర‌క్క దానిపై దృష్టి సారించ‌లేదు. మా కుటుంబానికి సింధి మాతృభాష‌. ఐతే తెలుగు, త‌మిళం బాగా మాట్లాడే నాకు ఆ భాష స‌రిగా రాదు. ఐతే నాకే స‌రిగా ఆ భాష రాన‌పుడు త‌ర్వాతి త‌రానికి ఏం అందించ‌గ‌లుగుతా. అందుకే లాక్ డౌన్ టైంలో ఆ భాష నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నా. లాక్ డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇంట్లో మా అమ్మ‌ను నాతో సింధి మాత్ర‌మే మాట్లాడ‌మ‌ని చెప్పా. ఏడాది తిరిగేస‌రికి ఈ భాష‌పై ప‌ట్టు సాధించాల‌ని టార్గెట్ పెట్టుకున్నా అని త‌మన్నా చెప్పింది. కేవ‌లం సినిమాల్లో న‌టించ‌డం ద్వారా తెలుగు, త‌మిళం సులువుగా నేర్చుకున్న త‌మ‌న్నా.. ఇలా ప‌ట్టుబ‌ట్టిందంటే సింధి నేర్చుకోవ‌డం ఎంత‌సేపు?