పూరి జగన్నాథ్ షాకిచ్చాడు

పూరి జగన్నాథ్ షాకిచ్చాడు

పూరి జగన్నాథ్ తర్వాతి సినిమా ఏదనే విషయంలో కొన్ని రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. పూరి తర్వాతి సినిమాలో హీరో అంటూ ముందు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల పేర్లు వినిపించాయి కానీ.. ‘ఇజం’ రిజల్ట్ చూశాక వాళ్లతో పూరి సినిమా చేసే అవకాశాలే లేవని తేలిపోయింది. ఇలాంటి టైంలో పూరి ఎవరితో సినిమా చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎప్పట్లాగే బ్యాంకాక్‌కు వెళ్లి తన తర్వాతి సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని వచ్చిన పూరి.. తన తర్వాతి సినిమా ఎవరితో అన్నది సన్నిహితుల దగ్గర వెల్లడించాడు.

తాజా సమాచారం ప్రకారం పూరి తన తర్వాతి సినిమాను ‘రోగ్’ హీరో ఇషాంత్‌తోనే చేయబోతున్నాడట. ‘రోగ్’ ఇంకా విడుదలే కాలేదు కానీ.. అతడితోనే రెండో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడట పూరి. నాగశౌర్యతో పాటు కొందరు యువ కథానాయకుల్ని పెట్టి చిన్న స్థాయి మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచనను కూడా ప్రస్తుతానికి పక్కనబెట్టేసిన పూరి.. తన సొంత నిర్మాణ సంస్థలో ఇషాంత్ హీరోగా సినిమా చేయడానికే డిసైడయ్యాడట. ‘రోగ్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబరులో విడుదలకు సిద్ధం చేసి.. ఆ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తాడట. ‘అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ తరహాలో కుటుంబ అంశాలున్న ప్రేమకథ ఇదని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు