ఆ గౌరవం పరుచూరి సోదరులకు మాత్రమేనా?

ఆ గౌరవం పరుచూరి సోదరులకు మాత్రమేనా?

టాలీవుడ్లో ఈ మధ్య తరచుగా రచయితలు గళం విప్పుతున్నారు. రచయితలకు సరైన గుర్తింపు దక్కట్లేదని.. వాళ్ల టాలెంట్ మరుగున పడిపోతోందని.. వరుసగా రైటర్లు.. రైటర్ టర్న్డ్ డైరెక్టర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొరటాల శివ ఇదే విషయమై కొంచెం గట్టిగానే మాట్లాడాడు. వక్కంతం వంశీ, డైమండ్ రత్నబాబు లాంటి వాళ్లు కూడా రచయితలకు దర్శక నిర్మాతలు చేస్తున్న అన్యాయం గురించి గళం విప్పారు. తాజాగా ఈ జాబితాలోకి బహుముఖ ప్రజ్నాశాలి తనికెళ్ల భరణి కూడా వచ్చారు. రచయితలకు సినీ పరిశ్రమలో సరైన గుర్తింపు దక్కట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఒక రచయిత క‌థ రాస్తేనే ద‌ర్శ‌కుడు దాన్ని సినిమాగా తీస్తాడు. రామ్ గోపాల్ వ‌ర్మ సైతం రైట‌ర్స్ క్రియేట్ చేస్తే... ద‌ర్శ‌కులైన రిక్రియేట్ చేస్తాం అన్నాడు. ఐతే ఎందుకో కానీ.. సినిమాకు మూలమైన కథ రాసే రచయితకు స‌రైన గుర్తింపు ఇవ్వ‌డం లేదు. సినిమా పోస్ట‌ర్ మీద రచయిత పేరు కూడా వేయ‌రు. ఒక్క ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ పేర్లు మాత్రేమే వేస్తుంటారు. మిగతా రచయితల పేర్లు పోస్టర్లపై కనిపించవు. ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు’’ అంటూ భరణి అన్నారు. భరణి స్వతహాగా రచయిత.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగానూ ప్రతిభ చాటుకున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. రచయితలకు ముందు నుంచి సరైన గుర్తింపు దక్కట్లేదు. ఐతే ఈ మధ్య రచయితలందరూ దర్శకులుగా మారి రాణిస్తుండటంతో వారి వాయిస్‌కు ప్రాధాన్యం దక్కుతోంది. మరి మున్ముందు అయినా పరిస్థితి మారుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English