చైతూ హీరోయిన్ని అంతగా భయపెట్టేశారా?

చైతూ హీరోయిన్ని అంతగా భయపెట్టేశారా?

సోషల్ మీడియా సినిమాల ప్రచారానికి బాగా ఉపయోగపడుతోంది ఈ రోజుల్లో. పైసా ఖర్చు లేకుండా సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఐతే ప్రతి విషయంలోనూ రెండో కోణం ఉన్నట్లే సోషల్ మీడియాకూ మరో కోణం ఉంది. ఇక్కడ పాజిటివ్ ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుందో.. నెగెటివ్ ప్రమోషన్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఓ సినిమా అయినా.. ఓ ఆర్టిస్టు అయినా నచ్చకపోతే ట్రోలింగ్ ఓ రేంజిలో చేస్తారు. తన తొలి సినిమా విషయంలో అలాంటి చేదు అనుభవమే ఎదుర్కొన్నానంటోంది ‘సాహసం శ్వాసగా సాగిపో’ భామ మాంజిమా మోహన్. ఈ ట్రోలింగ్ దెబ్బకు ఒక దశలో ఇంటి నుంచి బయటకు రాలేని స్థాయిలో తాను భయపడిపోయానని ఆమె వెల్లడించింది.

‘‘మా నాన్న మలయాళ సినిమాల్లో సినిమాటోగ్రాఫర్. ఆయన ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత చదువు పూర్తి చేసి ‘ఒరు వడక్కం సెల్ఫీ’ సినిమాతో హీరోయిన్ అయ్యాను. ఐతే ఎందుకో కానీ ఆ సినిమా విషయంలో.. ముఖ్యంగా నా విషయంలో నెగెటివ్ ప్రచారం చాలా జరిగింది. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేసుకున్నారు. నన్ను నటన మానుకోమంటూ కామెంట్లు చేశారు. నన్ను ట్యాగ్ చేస్తూ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. చాలా బాధపడ్డాను. ఒక దశలో నాకు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయమేసింది. ఎవరైనా నన్ను గేలి చేస్తారేమో అని ఇంటికే పరిమితం అయిపోయా. అలాంటి టైంలో గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి పిలుపు వచ్చింది. ఆడిషన్ టైంలో నన్ను తమిళ వెర్షన్ వరకే తీసుకుంటారనుకున్నా. కానీ తెలుగుకు కూడా నన్నే తీసుకుని ఆశ్చర్యపరిచారు’’ అని మాంజిమా తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు