కళ్యాణ్ అలా.. ఎన్టీఆర్ ఇలా..

కళ్యాణ్ అలా.. ఎన్టీఆర్ ఇలా..

నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లది భిన్నమైన ప్రయాణం. అన్న కంటే ముందు తమ్ముడు సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. చాలా త్వరగా స్టార్ ఇమేజ్ సంపాదించాడు. కెరీర్లో బిగ్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇక తమ్ముడి కంటే ఆలస్యంగా అరంగేట్రం చేసిన అన్న.. ఆద్యంతం కెరీర్లో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. చాలా వరకు సొంత బేనర్లలో సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదుంటే.. కళ్యాణ్ రామ్ వరుసగా రెండు పెద్ద ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. కానీ ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఏదో తేలని అయోమయంలో ఉంటే.. కళ్యాణ్ రామ్ ఆఫర్లతో తడిసి ముద్దయిపోతుండటం విశేషం.

వరుస ఫ్లాపుల నుంచి బయటపడి గత ఏడాది ‘టెంపర్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఎన్టీఆర్.. ఈ ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ లాంటి మరో మరపురాని విజయాన్నందుకున్నాడు. తాజాగా ‘జనతా గ్యారేజ్’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేశాడు. కానీ ఈ దీని తర్వాత మరో కొత్త సినిమాను పట్టాలెక్కించడానికే ఇబ్బంది పడిపోతున్నాడు తారక్. ‘జనతా గ్యారేజ్’ విడుదలకు ముందు వరకు అతను రైటర్ వక్కంతం వంశీ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీలో నటిస్తాడని అనుకున్నారు. ఈ సినిమా గురించి గతంలోనే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ వక్కంతం స్క్రిప్టు విషయంలో శాటిశ్ఫై అవక ఆ సినిమాను పక్కనబెట్టేశాడు తారక్. ఆ తర్వాత అనిల్ రావిపూడి ఓ కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ కాంబో కార్యరూపం దాల్చలేదు. ఇంతలో త్రివిక్రమ్‌తో పని చేయడానికి తారక్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ త్రివిక్రమ్.. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా కమిటై ఉన్నాడు. ఇప్పుడే ఫ్రీ అయ్యేలా లేడు. మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడంటూ కొత్తగా చందూ మొండేటి పేరు వినిపిస్తోంది. ఇది అయినా కన్ఫమ్ అవుతుందో లేదో చూడాలి. ఎన్టీఆర్ తన గత సినిమాను పూర్తి చేసి ఇప్పటికే రెండు నెలలు దాటిపోవడం గమనార్హం.

ఇక కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే.. గత ఏడాది ‘పటాస్’ తర్వాత ‘షేర్’ రూపంలో పెద్ద ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. తాజాగా ‘ఇజం’ కూడా ఫ్లాపే. ఐతే వరుసగా రెండు ఫ్లాపులు తిన్నా సరే.. కళ్యాణ్ రామ్ కోసం చాలామంది దర్శకులు లైన్లో ఉన్నారు. ‘పటాస్’ తర్వాత కళ్యాణ్ రామ్ కోసం మరో మంచి స్క్రిప్టు రెడీ చేశాడట అనిల్ రావిపూడి. ఇంకోవైపు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కళ్యాణ్ రామ్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ కోసం కథ రెడీ చేస్తున్నాడు. మరోవైపు ‘శ్రీరస్తు శుభమస్తు’తో విజయాన్నందుకున్న పరశురామ్ కళ్యాణ్ రామ్ కోసమే ఓ కథ రెడీ చేశాడు. నందమూరి హీరో కూడా కథ పట్ల ఆసక్తి చూపించాడట. మరోవైపు ‘ప్రస్థానం’ ఫేమ్ దేవా కట్టా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. అతడి టార్గెట్ కూడా కళ్యాణ్ రామే. అతను ఓ స్క్రిప్టుతో రెడీ అవుతున్నాడు. మొత్తానికి వరుస హిట్లతో ఊపుమీదున్న తారక్‌కు ప్రస్తుతం చేతిలో ఓ సినిమా లేదు కానీ.. రెండు పెద్ద ఫ్లాపులు ఎదుర్కొన్న కళ్యాన్ రామ్ మాత్రం మూణ్నాలుగు సినిమాలు లైన్లో పెడుతుండటం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు