పూరి సార్.. మీరు మారాలండీ

పూరి సార్.. మీరు మారాలండీ

ఒక బద్రి.. ఒక ఇడియట్.. ఒక అమ్మానాన్న తమిళ అమ్మాయి... ఒక పోకిరి.. ఇలా కెరీర్ ఆరంభంలో అలాంటిలాంటి సినిమాలు తీయలేదు పూరి జగన్నాథ్. కమర్షియల్ తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పిన నవతరం దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. ఐతే అప్పుడు కొత్త దారిలో నడిచినవాడే.. ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి సినిమాలు తీస్తున్నాడు. తన సినిమాల్ని తనే కాపీ కొడుతూ.. ఒకే మూసలో సినిమాలు తీస్తూ.. సామాన్య ప్రేక్షకులే కాదు.. తన అభిమానుల సహనాన్ని కూడా పరీక్షిస్తున్నాడు పూరి.

దాదాపు దశాబ్ద కాలంగా తన పాత కథల్నే అటు తిప్పి.. ఇటు తిప్పి మళ్లీ తీస్తూ తననుంచి ఏదో ఆశించి థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తూ వస్తున్నాడు పూరి. నేను నా రాక్షసి.. గోలీమార్.. దేవుడు చేసిన మనుషులు.. బిజినెస్ మేన్.. హార్ట్ అటాక్.. తాజాగా ఇజం.. ఇలా పూరి గత కొన్నేళ్లలో చేసిన చాలా సినిమాల్ని పరిశీలిస్తే అందులో కథలు చాలా వరకు మాఫియా డాన్ల చుట్టూ తిరుగుతాయి. హీరో హీరోయిన్ల పాత్రలు.. వాళ్ల మధ్య ప్రేమాయణాల్లోనూ పోలికలు కనిపిస్తాయి. పూరి గత కొన్నేళ్లలో చేసిన చాలా సినిమాలు పైపై మెరుగులతో లాగించేసినవే. కథాకథనాలపై కసరత్తులు చేసినట్లుగా కనిపించదు. తన గురువు రామ్ గోపాల్ వర్మ తరహాలో ఏదో ఒక ఐడియాకు ఎగ్జైట్ అయిపోవడం.. దాని చుట్టూ చకచకా కథ అల్లేయడం.. మామూలు సన్నివేశాలతో లాగించేయడం.. పబ్లిసిటీ బాగా చేసి విడుదలకు ముందు హైప్ తీసుకురావడం.. ఇలా సాగుతోంది పూరి వరస.

తాజాగా ఎంతో హడావుడి మధ్య విడుదలైన ‘ఇజం’ చూస్తే అందులోనూ ఏ ప్రత్యేకతా లేదు. ఏదో కళ్యాణ్ రామ్ మేకోవర్ అంటూ హంగామా తప్పితే సినిమాలో కంటెంట్ చాలా వీకే. పూరి స్థాయి అంతకంతకూ ఎలా పడిపోతోందో చెప్పడానికి ఈ సినిమా రుజువులా నిలిచింది. ఒక సీరియస్ కథను ఎంత సిల్లీగా నడపాలో అంత సిల్లీగా నడిపించాడు పూరి. దీంతో ఎన్నో అంచనాలతో ఈ సినిమాకు వెళ్లినవాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘ఇజం’ రిజల్ట్ చూశాక.. పూరితో సినిమా చేయాలన్న ఆలోచనను పక్కనపెట్టేశాడు ఎన్టీఆర్. మరోవైపు మహేష్ బాబు కూడా పూరిని పక్కనబెట్టేశాడు. ప్రస్తుతానికి ఏ స్టార్ హీరో కూడా పూరితో పని చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ పూరి కొంచెం శ్రద్ధ పెట్టి తన స్థాయికి తగ్గ సినిమా చేస్తే తప్ప మళ్లీ స్టార్లు ఆయన వైపు చూసే పరిస్థితి లేదు. కెరీర్లో పడటం లేవడం పూరికి అలవాటే కాబట్టి ఈసారి ఆయన మంచి సినిమాతో వస్తాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు