పవన్‌ కోసం దేవుడేం దిగి రాలేదు

పవన్‌ కోసం దేవుడేం దిగి రాలేదు

పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కొత్త సినిమా త్వరలో మొదలు కానుంది. ఇంకా ఈ చిత్రం కథే ఒక కొలిక్కి రాలేదు. అయితే అత్యుత్సాహ పడుతోన్న మీడియా దీనికో పేరు కూడా పెట్టేసింది. 'దేవుడే దిగి వచ్చినా' అంటూ టైటిల్‌ పెట్టి, ఇందులో పవన్‌కి జంటగా సమంతని కుదిర్చేసింది. దీంతో చిత్ర బృందం అలర్ట్‌ అయి, 'బాబూ... మా సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ఫిక్స్‌ కాలేదు. ఇంకా పేరేదీ అనుకోలేదు' అని వివరణ ఇచ్చుకుంది. త్రివిక్రమ్‌, పవన్‌ కలుస్తున్నారంటే ఈమాత్రం ఉత్సాహం ఉండడం కామనే అనుకోండి. ఎందుకంటే మరి వీరిద్దరిదీ మామూలు కాంబినేషనా? లాస్ట్‌ టైమ్‌ ఇద్దరూ కలిసి అత్తారింటికి దారేదో కనుక్కుందామని చూస్తే మగధీర రికార్డులు గల్లంతయి, ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాయి. అందుకే వీళ్ల సినిమా అంటే అందరికీ అంత క్రేజు, ఈ రేంజి మోజు.

ఈ సంగతి బాగా తెలుసు కనుకే త్రివిక్రమ్‌ ఈసారి ఆషామాషీ కథ రాసేసుకుని రాకుండా, పవన్‌ ఇమేజ్‌ని పదింతలు పెంచే కథనే రెడీ చేస్తున్నాడట. అసలే మరో రెండో, మూడో సినిమాలు చేస్తానంటోన్న స్నేహితుడిని ఇండస్ట్రీ నుంచి సాగనంపే ముందు తననుంచి ఒక బ్రహ్మాండమైన సినిమాని గిఫ్టుగా ఇచ్చేద్దామని చూస్తున్నాడట. నవంబర్‌ 5న లాంఛనంగా మొదలయ్యే ఈ చిత్రం షూటింగ్‌ మాత్రం ఫిబ్రవరిలోనే పట్టాలెక్కుతుంది. ఇంకా చాలా టైమ్‌ వుంది కాబట్టి ఈలోగా నామకరణ మహోత్సవాలేం చేసేయకండని చిత్ర బృందం కాస్త గౌరవంగానే మీడియాని కోరుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు