ఆపేయ్‌ వర్మా... సర్కార్‌పై సర్వ హక్కులూ మావే!

ఆపేయ్‌ వర్మా... సర్కార్‌పై సర్వ హక్కులూ మావే!

చాలా కాలం తర్వాత ఒక చెప్పుకోతగ్గ సినిమా చేస్తోన్న రాంగోపాల్‌వర్మకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అమితాబ్‌బచ్చన్‌తో సర్కార్‌ 3 చిత్రాన్ని ఇటీవలే లాంఛ్‌ చేసి ప్రస్తుతం ముంబయిలో షూటింగ్‌ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లి అమితాబ్‌ని బాలకృష్ణ కలిసిన సంగతి తెలిసిందే. మళ్లీ సర్కార్‌తో గత వైభవం వస్తుందని రాంగోపాల్‌వర్మ ఆశ పడుతూ ఉంటే, ఈ చిత్రం షూటింగ్‌ తక్షణం ఆపేయ్యాలంటూ ఒక కోర్టు నోటీస్‌ వచ్చింది.

 సర్కార్‌ ఫ్రాంచైజీపై సర్వ హక్కులూ తనవేనని, తనని కాదని ఈ చిత్రానికి సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ తీయడానికి కానీ, లేదా అవే గెటప్స్‌, క్యారెక్టర్స్‌ వాడడానికి కానీ కుదరదని నరేంద్ర హీరావత్‌ లీగల్‌ నోటీస్‌ ఇచ్చాడు. ఈ చిత్రంలో పని చేస్తున్న వారందరినీ తక్షణం ఈ ప్రాజెక్ట్‌ వదులుకోవాలంటూ, లేదా చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారంటూ పత్రికాముఖంగా సదరు నిర్మాత హెచ్చరిక జారీ చేసాడు.

కాంట్రవర్సీలు రాంగోపాల్‌వర్మకి కొత్త కాదు కాబట్టి వీటిని పెద్దగా లెక్క చేయకపోవచ్చు. అయితే కాపీ రైట్‌ చట్టం పటిష్టంగా ఉంది కనుక వర్మ అనుకున్నట్టుగా సర్కార్‌ 3 పూర్తి చేసేసి తన ఇష్టానికి విడుదల చేసుకోవడం కుదరదు. ఖచ్చితంగా సర్కార్‌ పాత నిర్మాతతో రాజీ కుదుర్చుకుంటే కానీ సర్కార్‌ 3కి ఏర్పడిన ఆటంకాలు తొలగవు. మరి సర్కార్‌ కోసం వర్మ దిగి వస్తాడో రాడో చూడాలి.