చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ బాధ

చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ బాధ

ఉదయ్ కిరణ్.. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి. కెరీర్ ఆరంభంలో అతడి ఊపు చూసి ఎక్కడికో వెళ్లిపోతాడనుకున్నారు. కానీ సక్సెస్‌ను నిలబెట్టుకోలేక దారుణమైన స్థితికి చేరాడు. చివరికి తీవ్ర మానసిక వేదనతో ప్రాణాలే తీసుకున్నాడు. చనిపోయే ముందు కొన్న రోజుల ముందు అతను చాలా బాధనే అనుభవించిన సంగతి చాలామందికి తెలియదు. అసలు అతడి గురించి ఎవరికీ పట్టింపు కూడా లేదు. ఐతే ఉదయ్ కిరణ్ ఎలా బాధపడేవాడో తనకు తెలుసంటున్నాడు అతడి మిత్రుడైన అల్లరి నరేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ గురించి ఒక బాధాకర విషయం చెప్పాడు నరేష్.

‘‘చనిపోక ముందు ఉదయ్ నన్నొక రోజు కలిశాడు. ఎందుకో అతడి ముఖంలో దిగులు, బాధ కనిపించాయి. ఏమైంది.. ఎందుకలా ఉన్నావ్ అని అడిగాను. పొద్దునే పేపర్లో ఒక ఆర్టికల్ చదివానని.. అందులో ఒక యువ కథానాయకుడు కథలు సరిగా ఎంచుకోవట్లేదని రాసి ఉన్నట్లు చెప్పాడు. దానికెందుకు అంత బాధపడుతున్నావ్.. నీకు సంబంధించిన విషయం కాదు కదా అన్నాను. ఐతే ఆ ఆర్టికల్ వేరే హీరోకు సంబంధించిందే అయినా.. అతడు కథలు ఎంచుకోవడంలో మార్పు రాకపోతే చివరికి ఉదయ్ కిరణ్‌ గతే పడుతుంది అంటూ తనను ఉదాహరణగా చూపించారని బాధపడ్డాడు. దాంతో నాకు నోట మాట రాలేదు. చాలా బాధపడ్డాను. ఒక నటుడు మంచి స్థాయిలో ఉన్నపుడు ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే.. తర్వాత కింద పడ్డపు ఎంత చిన్నచూపు చూస్తారో ఆ సంఘటనతో తెలుసుకున్నాను. ఎంత పెద్ద నటులైనా.. అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయని చాలామందికి తెలియదు’’ అంటూ ఆవేదన చెందాడు అల్లరి నరేష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు