శభాష్ క్రిష్.. అదరగొట్టావ్

శభాష్ క్రిష్.. అదరగొట్టావ్

కనిపించే ఆ మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతి రూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అంటాడు పోలీస్ స్టోరీలో సాయికుమార్. ఈ డైలాగ్ ఎంత ఫేమస్సో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం సినిమా సెన్స్ ఉన్నవాడైనా ఈ డైలాగ్ చెప్పేస్తాడు. ఐతే ఈ డైలాగ్ తప్పు అంటున్నాడు డైరెక్టర్ క్రిష్. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా తనది కూడా పోలీసు రక్తమే అని చెబుతూ ట్విట్టర్లో ఆయన పెట్టిన మెసేజ్‌లో సాయికుమార్ డైలాగ్‌ను తప్పుబట్టాడు క్రిష్. ఇంతకీ క్రిష్ ఏమంటున్నాడంటే..

‘‘నేను డైరెక్టర్ కంటే ముందు ఒక పోలీస్ మనవణ్ని. మా తాతగారు జాగర్లమూడి రమణయ్య గారు. నాలో ఉంది కూడా ఓ పోలీస్ రక్తమే అని గర్వపడుతున్నాను. సహజంగా సొసైటీలో మనకంటూ ఒక సెక్యూరిటీ కోసం ఉద్యోగాలు చేస్తుంటాం. కానీ పోలీసుకి సెక్యూరిటీ ఉండదు. పోలీస్ లేకపోతే సొసైటీకి సెక్యూరిటీ ఉండదు. రాజ్యాంగంలో హక్కుల కోసం పోరాడే హక్కులేని ఏకైక ఉద్యోగి పోలీస్. బయట చాలామంది అంటుంటారు.. ఆ మాటలు అందరికీ వినిపించే ఉంటాయి. పోలీసుల్ని నమ్మకూడదు.. పోలీసులతో స్నేహం చేయకూడదు.. ఇంకా చాలా చాలా ఇలాంటివి. ఎవరైతే మనల్ని రక్షించడానికి బతుకుతున్నారో.. ఎవరైతే మనకోసం చనిపోవడానికి జీతాలు తీసుకుంటున్నారో వాళ్లనే నమ్మకూడదంటే.. మనల్ని ఎవరూ నమ్మకూడదని అర్థం. ఎదుటివాడి నమ్మకాన్ని.. స్నేహాన్ని పొందే అర్హత మనకు లేదని అర్థం. అందరూ అనుకుంటున్నట్లు కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతి రూపాలైతే ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహం పోలీస్ కాదు. కనిపించకుండా వెనుకాడాల్సిన అవసరం.. దాక్కోవాల్సిన అగత్యం ఆ సింహానికి లేదు. కనిపించే ఆ మూడు సింహాల్ని రక్షించే నరసింహం పోలీస్’’ అని చెబుతూ పోలీసు సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు క్రిష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు