మానాన్న నన్ను పొగిడేవాడు కాదు-నాగ్

మానాన్న నన్ను పొగిడేవాడు కాదు-నాగ్

తాను కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినా.. తన తండ్రి నాగేశ్వరరావు తనను పొగిడేవాడు కాదంటున్నాడు అక్కినేని నాగార్జున. కొడుకును తండ్రి పొగడకూడదన్న ఉద్దేశంతో ఆయన సైలెంటుగా ఉండేవాడని నాగ్ చెప్పాడు. ఐతే తాను మాత్రం తన కొడుకు నాగచైతన్య విషయంలో అలాంటి సందేహాలేమీ పెట్టుకోకుండా పొగిడేస్తానని.. 'ప్రేమమ్' సినిమాలో చైతూ అద్భుతంగా నటించాడని అన్నాడు నాగ్. ''ప్రేమమ్ సినిమా ఆఖర్లో ఒక డైలాగ్ ఉంటుంది. కొడుకు సంతోషం కన్నా తండ్రికి కావాల్సిందేముంటుంది అని. ఇప్పుడు అదే చెబుతున్నా. నా కొడుకు చైతన్యకు సక్సెస్ రావడం కంటే సంతోషం ఏముంటుంది? 'ప్రేమమ్' క్లైమాక్స్‌లో శ్రుతి హాసన్ స్వీట్ చూసి.. వెంటనే చైతూ వైపు ఓసారి చూసినపుడు నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి'' అని నాగ్ చెప్పాడు.

'ప్రేమమ్' సినిమా ఫస్ట్ కాపీ చూసినపుడే తనకు ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నమ్మకం కలిగిందని.. దర్శకుడు చందూ మొండేటిని హగ్ చేసుకుని అభినందించానని.. ఈ సినిమా చూసి హ్యాపీగా ఇంటికెళ్తున్నట్లు ట్విట్టర్లో మెసేజ్ పెట్టానని నాగ్ చెప్పాడు. ఐతే ఒకరు 'ప్రేమమ్' చూసి హ్యాపీగా ఇంటికెళ్తున్నారా లేక ఇంటికెళ్తున్నందుకు హ్యాపీగా ఉన్నారా అని సెటైర్ వేసినట్లు నాగ్ గుర్తు చేసుకున్నాడు. మామూలుగా రీమేక్ చేయడం అంటే పెద్ద సాహసం అని.. అందులోనూ 'ప్రేమమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే అటు మలయాళ ఫ్యాన్స్.. ఇటు తమిళ ఫ్యాన్స్ చాలా కామెంట్లు చేశారని.. ఐతే మన క్లాసిక్ మూవీని వాళ్లు రీమేక్ చేసినా మనం అలాగే కామెంట్లు చేస్తాం కాబట్టి దీన్ని పట్టించుకోనవసరం లేదని నాగ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు