నిజం... పవనిజం!

నిజం... పవనిజం!

అవును నిజమే. ఇప్పుడు కుర్రకారంతా పవనిజం అంటూ ఊగిపోతోంది.
ట్రెండ్ ఫాలో కావడం కాదు, సెట్ చేయడమే మా నైజం అంటూ కదం తొక్కుతోంది.
సిసలైన హీరోయిజం అంటే అర్థం అదే అని నమ్ముతోంది. ఒకప్పుడు హీరో అంటే... నోట్లో సిగరెట్ పెట్టుకుని స్టైల్ గా కనిపించేవాడు. ఫూటుగా మందు కొట్టి ప్రేక్షకులనూ అలా వ్యసనాలకు గురయ్యేలా ప్రభావితం చేసేవాడు. ఒక హీరో మాత్రం ఆ లెక్కలను మార్చేశాడు. సమాజం గురించి ఆలోచించేవాడే నిజమైన హీరో అని చాటాడు. అభిమానులకూ అదే స్పూర్తిని అందిస్తున్నాడు. ఆయనే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిత్వమే...  పవనిజం. దాన్నే ఇప్పుడు యువతరం అనుసరిస్తోంది. అయినదానికీ, కానిదానికీ బయటికొచ్చి మాట్లాడటం పవన్ కళ్యాణ్ కి అస్సలు నచ్చదు. ఏదైనా చేతల్లోనే చూపించాలంటాడు. అలాగే చేస్తుంటాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనొక నిశ్శబ్ద సంచలనం. అందుకే అలా తెల్లటి మబ్బుల చాటు నుంచి అలా నడిచిరాగానే రికార్డులు బద్దలైపోయాయి. మరిన్ని రికార్డులు దాసోహం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. భయం...  అనే మాట నా నిఘంటువులోనే లేదని చాటాడు పవన్ కళ్యాణ్. వరసగా సినిమాలు చేయాలి, అందరికంటే ముందుండాలి అనే నైజం ఆయనలో అస్సలు కనిపించదు. అదే ఆయన్ని ప్రత్యేకమైన కథానాయకుడిగా నిలబెట్టింది.

జయాపజయాలదే కీలకమనుకునే చిత్ర పరిశ్రమలో వాటికీ అతీతంగా తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు పవన్. ఆయనపై అభిమానుల్లో ఎప్పుడూ ఒకే రకమైన క్రేజ్ కనిపిస్తుంటుందంటే కారణం అదే.  విజయమైనా, పరాజయమైనా మొహంపై చిరునవ్వును చెరిగిపోనివ్వరు పవన్. అదే అయన ప్రత్యేకత.

కాలేదే నిప్పు. గుండ్రంగా తిరిగేదే  భూమి. పోరాడేవాడే మనిషి. - బాలు సినిమాలో పవన్ కళ్యాణ్  చెప్పిన డైలాగ్ ఇది. కేవలం సినిమాలోని డైలాగ్ మాత్రమె కాదిది.  పవన్  నైజం కూడా ఇంతే. తన భావాలనే తెరపై చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. పోరాటం ఆయనకు అలవాటైన పనే. నిత్యం పరిస్థితులతో పోరాడుతుంటాడు. తనతో తానె పోరాటం చేస్తుంటాడు. అందుకే `ఆరడుగుల బుల్లెట్టు... వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...` అని కలాలు  ఆయన్ని కొలిచాయి. `వ్యక్తిగతంగా నాకు చాలా సమస్యలుంటాయి` అని  చెబుతుంటాడు పవన్. అయితే వాటి తాలూకు ప్రభావం మాత్రం గుండె లోతుల్లోనే అదిమి పెట్టుకుంటాడు. ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా... బయటికొస్తే మాత్రం స్వచ్చమైన చిరునవ్వులు చిందిస్తాడు. అభిమానుల్లో భరోసాని నింపుతాడు. మనకు చాలా మంది హీరోలు ఉంటారు. కానీ రియల్ హీరోలు మాత్రం కొద్దిమందే. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. చిరంజీవి తమ్ముడిగా తెరపైకొచ్చాడు. ఇప్పుడు పవన్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయికి చేరుకున్నాడు. ఈ ఎదుగుదలకు కారణం కేవలం పవన్ వ్యక్తిత్వమే. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ భవితవ్యాన్ని మార్చే సత్తా పవన్ కళ్యాణ్ కి ఉంది అంటున్నారంటే కారణం అదే.

స్వచ్చమైన వినోదాలనే ప్రేక్షకులకు అందించాలని తపిస్తుంటాడు పవన్. ఆయన  సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. అడుగడుగునా ఆటుపోట్లు ఎదురయ్యాయి. అయితే తనదైన శైలితో వాటి ప్రభావం తనపై ఏమాత్రం పడనీయకుండా చూసుకున్నాడు. `తొలిప్రేమ`, `సుస్వాగతం` సినిమాలతో యువతరాన్ని తనవైపు తిప్పుకున్నాడు పవన్. `ఖుషీ`, `జల్సా` చిత్రాలతో బాక్సాఫీసు రారాజుగా అవతరించాడు. ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. `గబ్బర్ సింగ్` సినిమాతో ట్రెండ్ సృష్టించాడు. `అత్తారింటికి దారేది` సినిమాతో...  `నేను సింహం లాంటోడిని` అని చెప్పబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ని స్టార్ అనో...  పవర్ స్టార్ అనో రెండు మూడు పదాల్లో ఇమడ్చలేం.  అంతకంటే గొప్పమాటలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో వెదకాలి. యువతరం గుండె చప్పుడు... పవన్ కళ్యాణ్ జన్మదినం ఈరోజు. ఆయనకు గుల్టే.కాం శుభాకాంక్షలు చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు