వర్మ.. విజయ్ మాల్యాను టార్గెట్ చేశాడు

వర్మ.. విజయ్ మాల్యాను టార్గెట్ చేశాడు

రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఏదో ఒక సంచలనానికి కేంద్రంగా మారక మానదు. తన కొత్త సినిమా 'వంగవీటి"తో తెలుగు నాట పెద్ద వివాదమే రాజేయబోతున్నాడని దాని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఇక వర్మ చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్లో తెరకెక్కించబోయే 'సర్కార్-3' లోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికే చూస్తున్నాడని.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మొదలుపెట్టిన పోర్టల్ చూస్తేనే అర్థమైపోతుంది.

'సర్కార్-3' గురించి అధికారిక సమాచారాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఏర్పాటు చేసిన పోర్టల్‌లో సినిమా సినాప్సిస్ ఏంటో బ్రీఫ్‌గా చెప్పే ప్రయత్నం చేసిన వర్మ.. దాంతో పాటు ఈ చిత్రంలోని పాత్రల్ని కూడా పరిచయం చేశాడు. అమితాబ్ ఎప్పట్లాగే సుభాష్ నాగ్రే అలియాస్ సర్కార్‌గా కనిపించబోతుండగా.. జాకీష్రాఫ్ చేయబోయే మరో కీలక పాత్రే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పాత్ర పేరు మైకేల్ వాల్యా అట.

ఒకప్పుడు అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో ఉండి.. ఆ తర్వాత లండన్‌లో బిజినెస్‌మ్యాన్‌గా సెటిలైన క్యారెక్టర్ అట ఈ మైకేల్ వాల్యాది. ఈ పాత్ర విజయ్ మాల్యాను ఉద్దేశించి పెట్టిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాల్యా అని సౌండ్ వచ్చేలా వాల్యా అని పేరు పెట్టడం.. లండన్‌లో సెటిలైన బిజినెస్ మ్యాన్ అని చెబుతుండటాన్ని బట్టి వర్మ విజయ్ మాల్యాను టార్గెట్ చేశాడన్న సంగతి స్పష్టమైపోయింది. మరి ఈ పాత్రను వర్మ ఎలా చూపిస్తాడో చూడాలి. ఇంకా ఈ సినిమాలో మనోజ్ బాజ్ పేయి, యామి గౌతమ్, రోహిణి హట్టంగడి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఆ పాత్రలన్నింటినీ తన పోర్టల్‌లో పరిచయం చేశాడు వర్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు