'జియో'ను ర్యాగింగ్ చేస్తున్నారట

'జియో'ను ర్యాగింగ్ చేస్తున్నారట

టెలికాం మార్కెట్ సంచలనంగా బిజినెస్ సెక్టార్ పేర్కొంటున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పై ఇతర టెలికాం కంపెనీలు ర్యాగింగ్ కు పాల్పడుతున్నాయట. ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని స్వయంగా వెల్లడించారు. ఈ ర్యాగింగ్ ఆగడాలను  గమనిస్తున్నానని, ఇలాంటి చర్యలకు స్వస్తి పలకకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ప్రముఖ సీనియర్ విలేకరులు శేఖర్ గుప్తా, బర్కాదత్ ఆధ్వర్యంలో సాగిన 'ఆఫ్ ది కఫ్' షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెలికాం మార్కెట్లో ఎప్పటినుంచో పాతుకుపోయిన భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు ఇంటర్ కనెక్షన్ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఒక తెలివైన విద్యార్థికి ఎదురయ్యే ర్యాగింగ్ లాగే తామూ సంస్థాపర సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు.
 
యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఆవిష్కృతమైన తమ కొత్త టెలికాం వెంచర్ లక్ష్యం రూ.1,50,000 కోట్లు కాదని, రూ.2,50,000కోట్లకు తాము పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని అంబానీ వివరించారు. శక్తివంతమైన ఆలోచనలతో ప్రపంచాన్నే మార్చేస్తామని పేర్కొన్నారు. "జియో మనుగడ, లాభాలపై కొంత మంది ఆర్థిక విశ్లేషకులు అనుమానాలు సరి కాదు. బాగా ఆలోచించిన తర్వాతే దీనిని తీసుకొచ్చాం. అత్యుత్తమంగా తీర్చిదిద్దిన వ్యాపారమిది. సాధారణంగా సాంకేతిక కంపెనీల తీరుతెన్నులను ఆర్థిక మార్కెట్లు సరిగా అర్థం చేసుకోలేవు. యాపిల్, గూగుల్ ల విషయంలోనూ అదే జరిగింది. కాబట్టి ఆర్థిక విశ్లేషకుల అంచనాలు, అభిప్రాయాలు తప్పు అని మేం నిరూపిస్తాం. మా త్రైమాసిక ఫలితాలను గమనిస్తే మీకే అర్థమవుతుంది. 12 ప్రాంతీయ భాషల్లో అత్యుతన్న నాణ్యతతో డేటా అనుబంధ సేవలు అందించడానికి జియో కృషిచేస్తోంది. 2018-19కి స్థానిక భాషల్లోనే సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం" అని అంబానీ ధీమా వ్యక్తం చేశారు.
 
జియో బోర్డు సభ్యులందరూ తన వెన్నంటే ఉంటారని ఆశాభావం వ్యక్తంచేసిన అంబానీ జియో లాంటి అద్భుత సృష్టికి దోహదం చేసిన తన పిల్లలు, ప్రస్తుత జియో బోర్డు డైరెక్టర్లైన ఇషా అంబానీ, ఆకాశ్ లపై ప్రశంసలు కురిపించారు. భారత్ లో పాకిస్తాన్ నటీనటుల నిషేధంపైనా తన అభిప్రాయం వెల్లడించారాయన. భారతీయులకు మొదట దేశమే ముఖ్యమని, దేశం తర్వాతే కళలు, సంస్కృతి అని అన్నారు. పాకిస్తానీ కళాకారులను భారత్ లో నిషేధించాలన్న డిమాండ్‌ కు అంబానీ మద్దతిచ్చారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు