ఆ బ‌డా బేన‌ర్లో యేలేటి

ఎన్ని హిట్లు కొట్టాడు.. బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఎన్నిచ్చాడు.. ఎంత‌మంది స్టార్ల‌తో పని చేశాడు అని చూడ‌కుండా.. క్రియేటివిటీ, క్వాలిటీ లాంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే గ‌త రెండు ద‌శాబ్దాల్లో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన ఉత్త‌మ ద‌ర్శ‌కుల్లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఒక‌డు. ఐతేతో మొద‌లుపెట్టి మ‌నమంతా వ‌ర‌కు ఆయ‌న తీసిన ప్ర‌తి సినిమా చాలా కొత్త‌గా ఉంటుంది. ప్రేక్ష‌కుల‌కు ఒక ప్ర‌త్యేక అనుభూతిని ఇస్తుంది. కానీ మ‌న ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెసే దేనికైనా ప్రామాణికం కాబ‌ట్టి యేలేటికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆయ‌న అవ‌కాశాల కోసం కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. మ‌న‌మంతా త‌ర్వాత యేలేటి నుంచి మ‌రో సినిమా రావ‌డానికి నాలుగున్న‌రేళ్లు దాటిపోయింది.

నితిన్ హీరోగా యేలేటి రూపొందించిన చెక్ వ‌చ్చే శుక్ర‌వార‌మే విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌న కెరీర్‌కో మ‌లుపు అవుతుంద‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు. ఇన్నాళ్ల‌లాగా త‌న కెరీర్‌లో ఇక‌పై గ్యాప్ ఉండ‌ద‌ని, ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు తీస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం.

ప్ర‌స్తుతం టాలీవుడ్లో టాప్ బేన‌ర్అన‌ద‌గ్గ మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు యేలేటి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఆ సినిమా ఓ పేరున్న‌ హీరోతోనే ఉంటుంద‌ని కూడా చెప్పారు. దీంతో పాటు మ‌రో సినిమా కూడా క‌మిటయ్యాన‌ని ఆ వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు యేలేటి. చెక్ విష‌యానికి వ‌స్తే.. మామూలుగా మ‌న ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ది 60 శాతం తెర‌మీదికి తీసుకొస్తే గొప్ప అని, ఈ చిత్రానికి తాను 70 శాతం పైగానే తెర‌పైకి తేగ‌లిగాన‌ని, త‌న గ‌త చిత్రాల్లా ఇది నిరాశ ప‌ర‌చ‌ద‌ని, క‌చ్చితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని యేలేటి తెలిపాడు.

ఈ సినిమా ఆలోచ‌న 15 ఏళ్ల కింద‌ట చిన్న ఐడియా రూపంలో పుట్టింద‌ని.. ఇన్నేళ్ల త‌ర్వాత అది సినిమాగా రూపుదిద్దుకుంద‌ని యేలేటి చెప్పాడు. నితిన్‌తో ఇంకో రెండు మూడు క‌థ‌లు అనుకున్నామ‌ని, వాటిలో ఒక‌దానిపై కొంత కాలం వ‌ర్క్ చేసి, చివ‌రికి దాన్ని ప‌క్క‌న పెట్టి చెక్ చేశామ‌ని యేలేటి వెల్ల‌డించాడు.