క‌ళ్యాణ్ రామ్ నోట‌.. ఆ మాట‌

 క‌ళ్యాణ్ రామ్ నోట‌.. ఆ మాట‌

మొత్తానికి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంపై అధికారిక సమాచారం వచ్చేసింది. స్వయంగా నిర్మాతే ఆ సినిమా ఆగిపోయిందని కన్ఫమ్ చేశాడు. ఆ నిర్మాత కళ్యాణ్ రామ్ కాగా.. అది జూనియర్ ఎన్టీఆర్-వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా. ‘జనతా గ్యారేజ్' విడుదల కావడానికి కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమా మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదికి వెళ్లేలాగానే కనిపించింది. కొన్ని నెలల ముందే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ పోస్టర్లు కూడా వదిలారు. ఐతే కథ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయడంలో పునరాలోచనలో పడ్డారని కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిని ఎన్టీఆర్ కానీ.. వక్కంతం కానీ ఖండించకపోవడం అనుమానాలు బలపడ్డాయి.

ఈ నేపథ్యంలో దాగుడుమూతలకు అవకాశం లేకుండా కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు చెప్పేశాడు. వక్కంతం కథ నచ్చక ఆ సినిమాను పక్కనబెట్టేశామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు కళ్యాణ్ రామ్. అంతకుమించి ఈ ప్రాజెక్టు గురించి ఏమీ మాట్లాడలేదు. వక్కంతం మరో కథేమైనా రెడీ చేస్తున్నాడా.. లేక కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తమ్ముడితో సినిమాను నిర్మించబోతున్నాడా అన్నది వెల్లడించలేదు. మరోవైపు సాయిధరమ్ తేజ్ తో చేయాల్సిన మల్టీస్టారర్ మూవీ గురించి వ్యాఖ్యానిస్తూ.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. ఇంకా కన్ఫమ్ కాలేదని కళ్యాణ్ రామ్ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు