దీపావళి తారాజువ్వ 'శివాయ్‌'!

దీపావళి తారాజువ్వ 'శివాయ్‌'!

బాలీవుడ్‌లో ఇటీవలిగా అందరి దృష్టినీ ఆకర్షించింది కరణ్ జోహార్, అజయ్ దేవ్‌గన్‌ల క్లాష్. అజయ్ సినిమా 'శివాయ్'కు వ్యతిరేకంగా కరణ్, కమాల్ ఆర్ ఖాన్ అనే నటుడికి డబ్బు ఇచ్చి మరీ ప్రచారం చేయించాడని వార్తలు గుప్పుమన్నాయి. వీరద్దరి మధ్య సాగిన సంభాషణ టేప్స్ సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కరణ్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు అజయ్. వీరి మధ్య వివాదాలు ముదిరిపోయాయని అజయ్ భార్య కాజోల్ కూడా కరణ్‌తో కటీఫ్ చెప్పిందని బీటౌన్ టాక్. అజయ్-కరణ్‌ల 'శివాయ్', 'యే దిల్ హై ముష్కిల్'లు ఒకే రోజు విడుదలవుతుండడంతో వీరి విబేధాలు పీక్స్‌కు వెళ్లిపోయాయని తెలుస్తోంది. తమ చిత్రాన్ని గెలుపు బాట పట్టించేందుకు కరణ్ వివిధ ప్రయత్నాలు చేశాడని, దాంట్లో ఒకటి 'శివాయ్‌'కు వ్యతిరేక ప్రచారమని సమాచారం.

అయితే, కరణ్ స్ట్రాటజీ అతడికి అంతగా కలిసొచ్చే సూచనలు కనిపించడంలేదు. దీపావళి రేసులో ఉన్న ఈ చిత్రాల్లో 'శివాయ్‌'దే ఘనవిజయమన్న విశ్లేషణలు తాజాగా ఊపందుకున్నాయి. ఐశ్వర్యరాయ్, రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవద్ ఖాన్ లాంటి స్టార్ నటీనటులతో కరణ్ తెరకెక్కించిన 'యే దిల్ హై ముష్కిల్' అనేక చిక్కుల్లో పడింది. హాట్ సీన్స్‌కు కత్తెరలు వేయించుకుని వార్తల్లో నిలిచిన ఈ చిత్రానికి థియేటర్లు ఇచ్చేందుకు చాలామంది ఉత్సాహం చూపడంలేదు. ఎందుకంటే పాకిస్తాన్ నటులు ఉండే చిత్రాలను అడ్డుకుని తీరతామని ఎంఎన్ఎస్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో ఫవద్ పాక్ వాసి. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటూ 'యే దిల్ హై ముష్కిల్'ను కు మొహం చాటేస్తున్నారు ఎగ్జిబిటర్లు.

'యే దిల్ హై ముష్కిల్' కు ఆశించినన్ని థియేటర్స్  లభించకపోవడంతో 'శివాయ్‌' టాప్ గ్రాసర్‌గా మారే అవకాశం ఉంది. అజయ్ సినిమాలో విదేశీయులు ఉన్నా వారు పాకిస్తాన్ వాసులైతే కాదు. ఇక, పాక్ కళాకారులపై ఇటీవల చెలరేగిన రచ్చలో అతడు ఎంఎన్ఎస్‌కు మద్దతు ఇచ్చాడు. వ్యక్తుల కంటే దేశం ముందు అని అన్నాడు. ఈ ఒక్క ప్రకటనతో ప్రజలు, రాజకీయ వర్గాలనూ ఆకట్టుకున్నాడు. దీంతో అతడి సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎటొచ్చీ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం సంగతే అనుమానాస్పదంగా మారింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాగూ సినిమాను ఆదరిస్తారు. ఆ హోప్స్‌తోనే కరణ్ టీమ్ దీవాలీకి దుమ్మురేపుతామని చెప్తోంది. శివాయ్ అజయ్‌ దేవ్‌గన్‌కు, యే దిల్ హై ముష్కిల్ కరణ్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్‌ కపూర్‌లకు కీలక సినిమాలు. సంచలనాలకు దూరంగా అజయ్ తన సినిమాను కూల్‌గా పూర్తి చేసేస్తే, కరణ్ పిక్చర్ మాత్రం సెన్సేషన్స్‌తో ఎప్పుడూ వార్తల్లోనే ఉంది. ఈ భిన్న చిత్రాల్లో ప్రేక్షకులు దేనికి పట్టం కడతారో వేచి చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు