ఉద్య‌మ పంథాను మార్చేసిన ముద్ర‌గ‌డ‌

ఉద్య‌మ పంథాను మార్చేసిన ముద్ర‌గ‌డ‌

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లే ల‌క్ష్యంగా ఉద్య‌మాన్ని ప్రారంభించిన కాపు ఐక్య‌వేదిక నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోమారు రోడ్డెక్కుతున్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల పేరిట ఆయ‌న తూర్పుగోదావ‌రి జిల్లా తునిలో నిర్వ‌హించిన కాపు గ‌ర్జ‌న హింసాత్మ‌కంగా మారింది. రిజ‌ర్వేష‌న్ల కోసం రోడ్డెక్క‌డం మిన‌హా మ‌రోమార్గం లేద‌ని ముద్ర‌గ‌డ చేసిన ప్ర‌క‌ట‌న‌కు కాపు యువ‌త వేగంగా స్పందించింది.  వెనువెంట‌నే తునిలోని కొబ్బ‌రి తొట‌ల‌ను వ‌దిలి... జాతీయ ర‌హ‌దారిపైకి చేరిన కాపులు బీభ‌త్స కాండ‌కు పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో అటుగా వెళుతున్న వాహ‌నాల‌తో పాటు ర‌త్నాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌పైనా ప్ర‌తాపం చూపారు. పోలీసులు,, పోలీస్ స్టేష‌న్లు, పోలీసు వాహ‌నాలు, అంబులెన్స్‌లపై కాపులు విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ముద్ర‌గ‌డ ఉద్య‌మ పంథాను తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. ఆ త‌ర్వాత తుని విధ్వంసం పేరిట అరెస్ట్ చేసిన కాపుల‌ను విడుద‌ల చేయాలంటూ ముద్ర‌గ‌డ కిర్లంపూడిలోని త‌న సొంతింటిలోనే నిరాహార దీక్ష‌కు దిగ‌గా... పోలీసులు ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆగ‌స్టులోగా కాపుల‌కు రిజ‌ర్వేషన్లు క‌ల్పించే విష‌యాన్ని తేల్చేస్తామ‌ని ముద్ర‌గ‌డ‌కు ప్ర‌భుత్వం నుంచి హామీ ల‌భించింది. అయితే ఆగ‌స్టు ముగిసింది. సెప్టెంబ‌రు మాసం కూడా వెళ్లిపోయింది. అయినా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని చంద్ర‌బాబు స‌ర్కారు ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు. దీంతో ముద్ర‌గ‌డ మ‌ళ్లీ రంగంలోకి దిగిపోతున్నారు. అయితే గ‌తంలో మాదిరిగా నిరాహార దీక్ష‌ల‌కు బ‌దులుగా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కిర్లంపూడిలోని త‌న ఇంటిలో నేటి ఉద‌యం మీడియాతో మాట్లాడిన ముద్ర‌గ‌డ ఈ ద‌ఫా పాద‌యాత్ర చేప‌ట్టి ప్ర‌భుత్వానికి నిర‌స‌న తెల‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సత్యాగ్ర‌హ యాత్ర పేరిట చేస్తున్న ఈ యాత్ర‌ను వ‌చ్చే నెల 16న ప్రారంభించి ఐదు రోజుల పాటు నిర్వ‌హిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. రావుల‌పాలెంలో ప్రారంభం కానున్న ఈ యాత్ర‌ను అంత‌ర్వేదిలో ముగించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇచ్చిన మాట‌ను చంద్ర‌బాబు నిలబెట్టుకోలేక‌పోయార‌ని, ఈ కార‌ణంగానే తాను మ‌రో మారు ఆందోళ‌న బాట ప‌ట్టాల్సి వ‌చ్చింద‌ని కూడా ముద్ర‌గ‌డ చెప్పుకొచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు