హాట్..వైల్డ్.. ఏంటీ చెత్త కామెంట్స్!!

హాట్..వైల్డ్.. ఏంటీ చెత్త కామెంట్స్!!

'పింక్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన మనవరాళ్లు నవ్య నవేలి, ఆరాధ్య బచ్చన్‌లకు రాసిన లేఖ వైరల్ అయింది. కుటుంబం, సమాజం పరిమితులు విధించినా స్వంత వ్యక్తిత్వంతో ముందడుగేయాలని సూచించారు. తాజాగా ఆయన కుమార్తె శ్వేత బచ్చన్ నంద కూడా తన కుమార్తె కోసం ఓ బహిరంగ లేఖ రాశారు. అయితే ఈ లెటర్ నవ్యను అడ్రస్ చేస్తూ కాక మీడియాను ఉద్దేశించి లిఖించారు. తన గారాలపట్టిని బలవంతంగా లైమ్‌లైట్‌లోకి లాగుతున్నారంటూ ప్రసారమాధ్యమాలపై అసంతృప్తి వెళ్లగక్కారు. కుమార్తె నవ్యపై ఇటీవలిగా మీడియాలో వస్తున్న వార్తలు, ఆమె ఫోటోల ప్రచురణపై శ్వేత విచారం వ్యక్తంచేశారు. తన కుమార్తె శరీరాన్ని ఉద్దేశించి 'హాట్', 'వైల్డ్' లాంటి మాటలు ఉపయోగించడంపై ఆవేదన చెందారు.

నవ్య టీనేజర్ అని ఆ వయసులో అమ్మాయిలు ఎలా ఉంటారో తానూ అలాగే ఉందని దీనికి ఇంతటి ఫోకస్ అవసరమా అని శ్వేత ప్రశ్నిస్తున్నారు. "సోషల్ మీడియాలో స్నేహితులతో నవ్య షేర్ చేసుకున్న ప్రైవేట్ ఫొటోలను వెబ్‌సైట్లలో పెట్టేస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు మీరు ఆమె అనుమతి తీసుకుంటున్నారా"? అంటూ సూటిగా క్వశ్చన్ చేశారు. "బీచ్‌ కు వెళ్లినప్పుడు ఎవ్వరైనా స్విమ్ సూటే వేసుకుంటారు. నవ్య కూడా అలాగే వేసుకుంది. మిత్రుల్లో అబ్బాయిలూ ఉంటారు. వారందరితో సరదాగా పార్టీలకు వెళ్తుంటుంది. నా కుమార్తె కూడా ఓ సర్వ సాధారణ టీనేజరే అంతకు మించి ఆమెలో అసంబద్ధ ప్రవర్తనను నేను గమనించలేదు" అని శ్వేత వ్యాఖ్యానించారు. మీడియాలో తనపై వస్తున్న వార్తలేవీ నవ్యకు తెలీదని చెప్పుకొచ్చారు. చిన్న పిల్లలను హాట్, వైల్డ్ అంటూ కామెంట్ చేయడం తగదని సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు