కంచె తీశాడు.. శాతకర్ణి తీయలేడా?

కంచె తీశాడు.. శాతకర్ణి తీయలేడా?

ముందుగా ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం.. టైట్ షెడ్యూల్స్ వేసుకుని రంగంలోకి దిగడం.. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఇక ఉరుకులు పరుగుల మీద పని చేయడం.. సినిమాను ఆన్ టైం రిలీజ్ చేయడానికి ఆపసోపాలు పడటం.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో ఇలాంటి వ్యవహారాలు మామూలైపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ గత మూడు సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు కూడా ఇలాగే హడావుడి పడ్డారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనూ ఇలాగే జరుగుతోందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీతనంతో కూడుకున్న ఈ ప్రెస్టీజియస్ మూవీని హడావుడిగా చుట్టేస్తున్నారంటూ ఇండస్ట్రీలో రూమర్లు బయల్దేరాయి.

ఐతే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ క్రిష్ వెంటనే అలర్టయ్యాడు. అవసరమైతే సినిమాను వాయిదా వేసుకుంటాం తప్ప రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పాడు. మొదట్నుంచి మంచి క్వాలిటీతో సినిమాను తీర్చిదిద్దుతున్నామని.. అందులో ఎంతమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నాడు. సంక్రాంతికే రావాలనేమీ లేదని.. ఇబ్బంది వస్తే సినిమాను వాయిదా వేస్తాం తప్ప హడావుడిగా ముగించేసే ప్రసక్తే లేదని చెప్పాడు. సినిమాను అనుకున్న ప్రకారమే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు క్రిష్ చెప్పాడు. అయినా క్రిష్ ఇంతకుముందు ‘కంచె’ లాంటి భారీ సినిమాను నాలుగు నెలల్లోనే పూర్తి చేశాడు. ఆ సినిమా అలా పూర్తిచేయగా లేనిది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని ఎనిమిది నెలల్లో అవగొట్టలేడా? ఏళ్లకు ఏళ్లు తీస్తేనే క్వాలిటీ వస్తుందనేమీ లేదు. ప్లానింగ్.. క్లారిటీ ఉండాలే కానీ కొన్ని రోజుల్లోనే మంచి క్వాలిటీతో సినిమా తీయొచ్చని చాలామంది చూపించారు. క్రిష్ కూడా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో అలాంటి ఓ స్టేట్మెంట్ ఇస్తాడని భావిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు