ప‌రీక్ష రాయ‌కుండానే టాప్ ర్యాంక్‌!

ప‌రీక్ష రాయ‌కుండానే టాప్ ర్యాంక్‌!

ఈ ఏడాది 12వ క్లాసులో బీహార్‌ టాపర్‌గా నిలిచిన రూబీరాయ్‌ అసలు పరీక్షే రాయలేదని ఫోరెన్సిక్‌ బృందం నివేదికలో వెల్లడైంది. రూబీరాయ్‌ రాత నమూనాను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షించిన బృందం పరీక్షను ఆమె రాయలేదని, వేరేవరో రాశారని నివేదిక సమర్పించింది. దీంతో ఈ ఘటనపై తాజాగా మరో కేసు నమోదయ్యే అవకాశమున్నది. ఈ కేసులో ఇప్పటివరకు 20మందిని అరెస్టు చేశామని బీహార్‌ టాపర్స్‌ స్కాంలో ప్రభుత్వం నియమించిన సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారి, పాట్నా ఎస్పీ మనుమహారాజ్‌ తెలిపారు.

బీహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు ఏర్పాటు చేసిన పరీక్షల్లో హ్యుమానిటీ విభాగంలో 500మార్కులకుగానూ 444మార్కులతో రూబీరాయ్‌ టాపర్‌గా నిలిచింది. అయితే ఓ టీవి చానల్‌ చేసిన ఇంటర్వ్యూతో రూబీ బండారం బయటపడింది. ప్రాథ‌మిక అవ‌గాహ‌నతో చెప్పాల్సిన వాటికి కూడా ఆమె జ‌వాబు ఇవ్వ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో తిరిగి పరీక్ష నిర్వ‌హించ‌డంతో ఆమె ఫెయిల‌యింది. దీంతో  ఆమె ర్యాంకును రద్దు చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేయగా రూబీ రాయ్ ప‌రీక్షే రాయ‌లేద‌ని తేలింది. ఇదిలాఉండ‌గా ఈ ప‌రీక్షల స్కాంలో అరెస్టైన వారిలో బీహార్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు మాజీ చైర్మన్‌ లాల్‌కేశ్వర్‌ ప్రసాద్‌, అతని భార్య ఉషా సిన్హా కూడా ఉండటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు