శిరీష్ కొత్త సినిమా అతడితోనా?

శిరీష్ కొత్త సినిమా అతడితోనా?

‘శ్రీరస్తు శుభమస్తు’తో ఎట్టకేలకు హిట్టు కొట్టాడు అల్లు శిరీష్. దీని తర్వాత మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో సినిమా చేయాల్సిందతను. ఐతే అనుకోకుండా ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టారు. చాలా భారీ తనంతో కూడుకున్న కథ కావడంతో ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం చాలా టైం పడుతుందని.. అందుకే ఓ ఆర్నెల్లు హోల్డ్‌లో పెట్టి వేరే సినిమా చేస్తానని అన్నాడు శిరీష్.

ఈ గ్యాప్‌లో అతను తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు శిరీష్. ఆనంద్ ఆల్రెడీ తెలుగులో ‘టైగర్’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం అతను నిఖిల్ హీరోగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్లో విడుదల కాబోతోంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసేసిన ఆనంద్.. ఇటీవలే అల్లు అరవింద్‌కు ఓ కథ చెప్పి మెప్పించాడట. ఆ కథతోనే శిరీష్ సినిమా చేయబోతున్నాడు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని.. గీతా ఆర్ట్సే నిర్మిస్తుందని సమాచారం.

తమిళంలో ‘అపూచి గ్రామం’ అనే వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వీఐ ఆనంద్. అది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ. దీనికి కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. ‘టైగర్’ మామూలు కమర్షియల్ సినిమానే కానీ.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మాత్రం వైవిధ్యమైన సినిమాలాగే కనిపిస్తోంది. ఇది కూడా సైన్స్ ఫిక్షన్ తరహాలోనే సాగేట్లుంది. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా భలే ఆసక్తిని రేకెత్తించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు