ఆ మ్యూజిక్ డైరెక్టర్లో అప్పుడే సరుకైపోయిందా?

ఆ మ్యూజిక్ డైరెక్టర్లో అప్పుడే సరుకైపోయిందా?

తెలుగు సినిమాను హీరోయిన్ల కొరతతో పాటు.. క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టర్ల కొరత కూడా వేధిస్తోంది. పెద్ద సినిమాల విషయానికి వస్తే.. ఐతే దేవిశ్రీ  ప్రసాద్.. కాకపోతే తమన్.. అడపా దడపా అనూప్ రూబెన్స్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కొత్త సంగీత దర్శకులు ఓ స్థాయిని మించి ఎదగలేకపోతున్నారు. ఇలాంటి టైంలో జిబ్రాన్ అనే తమిళ కుర్రాడు.. ‘రన్ రాజా రన్’లో ఫ్రెష్ మ్యూజిక్‌తో సంగీత ప్రియుల్ని కట్టిపడేశాడు. మరోవైపు కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల్లో అతడి మ్యూజిక్ విని అతడి మీద మరింతగా అంచనాలు పెంచుకున్నారు తెలుగు ప్రేక్షకులు. అతడికి మంచి మంచి అవకాశాలు కూడా దక్కాయి.

విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో ‘బాబు బంగారం’.. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరోతో ‘హైపర్’ సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఐతే ఈ అవకాశాల్ని జిబ్రాన్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. తన మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లు మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. ‘బాబు బంగారం’ పాటలు యావరేజ్ అనిపించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అంతంతమాత్రమే. ‘హైపర్’కు ఆర్ఆర్ అతడితో చేయించలేదు. పాటలకు మాత్రమే ఛాన్సిచ్చారు. ఐతే అతను పూర్తిగా నిరాశ పరిచాడు. ఇందులో ఒక్కటంటే ఒక్క పాట కూడా జనాల నోళ్లల్లో నానట్లేదు. ఏదో మొక్కుబడిగా వాయించేసినట్లు అనిపించింది జిబ్రాన్. కమర్షియల్ సినిమా కాబట్టి కొత్తదనం చూపించలేకపోయాడంటే ఓకే కానీ.. కనీసం ఎంటర్టైనింగ్ ట్యూన్స్ ఇవ్వాలి కదా. అలాంటి ట్యూన్లేమీ ఇందులో లేవు. సినిమాకు హిట్ టాక్ వచ్చినా.. సంగీతం మాత్రం దీనికి మైనస్‌గా నిలిచింది. తెలుగులో తొలి సినిమాతో ఎన్నో ఆశలు రేపిన జిబ్రాన్.. త్వరగా తన పేరు చెడగొట్టుకున్నాడు. జిబ్రాన్ రాబోయే సినిమాల్లో తన ప్రత్యేకత చూపించలేకపోతే ఎంత వేగంగా వెలుగులోకి వచ్చాడో.. అంతే వేగంగా కనుమరుగైపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English