తేడా వస్తే కష్టం రామ్

తేడా వస్తే కష్టం రామ్

లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు చేయాలన్నా.. మాస్ హీరోగా కనిపించాలన్నా.. వీర లెవెల్లో ఫైట్లు చేయాలన్నా.. ఫిజిక్.. బాడీ లాంగ్వేజ్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. యువ కథానాయకుడు రామ్ కు ఆ విషయంలో కొన్ని మైనస్సులున్నాయి. అతను చాక్లెట్ బాయ్ లా కనిపిస్తాడు. ఆకారం కూడా భారీగా ఏమీ ఉండదు. ఐతే తొలి సినిమా నుంచి కొంచెం మాస్ గా కనిపించడానికి.. వీరత్వం చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాడు రామ్. యాటిట్యూడ్ చూపించే వరకు బాగానే ఉంటుంది కానీ.. అతను అంతేసి మందిని చితకబాదేస్తుంటే.. విలన్లపై రెచ్చిపోతుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దీనికి తోడు అతను వేసే క్యారెక్టర్లు రొటీన్ అయిపోవడం మైనస్ గా మారి.. ఒక దశలో వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు.

ఇలాంటి టైంలో రామ్ రూటు మార్చి ‘నేను శైలజ’లో ఒద్దికగా కనిపించాడు. సినిమా కూడా డీసెంట్ గా ఉండటంతో మంచి విజయం సాధించింది. ఇందులో రామ్ ను చూసి అందరూ ప్రశంసించారు. వీర విన్యాసాలు కట్టి పెట్టి ఒద్దికగా నటిస్తే రామ్ ఎంత బాగుంటాడో ఈ సినిమా చూపించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రామ్ కు మాత్రం ఆ సినిమా సంతృప్తినివ్వలేదట. మాస్ మసాలా సినిమాలు చేయడమే తనకు ఇష్టం అన్నట్లు మాట్లాడాడు. తన నుంచి అభిమానులు అవే ఆశిస్తాయని చెప్పాడు. తనకున్న బిరుదుకు తగ్గట్లుగా ఎనర్జిటిగ్గా కనిపిచడమే ఇష్టం అని చెప్పాడు. ‘హైపర్’లో అలాగే కనిపించబోతున్నాడు రామ్. ఈ సినిమా హిట్టయితే రామ్ మాటలు కరెక్టే అనుకోవచ్చు. కానీ ఫలితం తేడా వస్తే మాత్రం.. రామ్ విమర్శలకు గురవ్వాల్సి ఉంటుంది. లేక లేక కొంచెం వైవిధ్యంగా ఓ సినిమా చేసి హిట్టందుకున్న వాడు.. మళ్లీ ఇలా రొటీన్ బాట పట్టాడేంటి.. అతడికి ఇలాంటి విన్యాసాలు అవసరమా.. ఈ టైపు కామెంట్లు పడతాయి. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘హైపర్’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు