ధోని సినిమా ఉన్నదున్నట్లుగానే..

ధోని సినిమా ఉన్నదున్నట్లుగానే..

బాలీవుడ్లో బయోపిక్స్ హవా సాగుతోంది కొన్నేళ్లుగా. ఈ కోవలోనే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా 'ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమా రాబోతోంది. ఐతే బయోపిక్స్ అనగానే ఉన్నదున్నట్లు తీస్తే అంత కిక్కుండదని.. కొంచెం మసాలా జోడించడానికి ప్రయత్నిస్తుంటారు ఫిలిం మేకర్స్. 'బాగా మిల్కా బాగ్' నుంచి 'అజహర్' వరకు కొంత వరకు వాస్తవాల వక్రీకరణ జరిగిన మాట వాస్తవం. అసలు విషయాల్ని కొంచెం ఎక్కువ చేసి చూపించారు ఆ సినిమాల్లో. హీరో పాత్రల్ని వాస్తవానికంటే గొప్పగా చూపించే ప్రయత్నం జరిగింది. ఐతే 'ఎం.ఎస్.ధోని' సినిమాలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని అంటున్నాడు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ధోని జీవితాన్ని తాము ఉన్నదున్నట్లుగా చూపించినట్లు అతను తెలిపాడు.

''ధోనికి లేని గొప్పదనాన్ని ఆపాదించాలని.. అతడి జీవితాన్ని ఎక్కువ చేసి చూపించాలని మేం ప్రయత్నించలేదు. దేనికీ గ్లామర్ కోణాన్ని ఆపాదించలేదు. ధోని పుట్టడం దగ్గర్నుంచి 2011 ప్రపంచ కప్ వరకు మేం ప్రతి విషయాన్ని ఉన్నదున్నట్లుగా చూపిస్తున్నాం'' అని సుశాంత్ తెలిపాడు. ఇక ధోని పాత్ర చేసే క్రమంలో తాను ధోనితో మరీ ఎక్కువేమీ మాట్లాడలేదని.. ఎక్కువ ఇన్ పుట్స్ ఏమీ తీసుకోలేదని.. అతడితో కేవలం మూడు సార్లు మాత్రమే మాట్లాడానని సుశాంత్ చెప్పాడు. ''ఈ సినిమా విషయంలో నాకు ధోని తన క్రికెటింగ్ స్టయిల్.. మేనరిజం గురించి ఏమీ చెప్పలేదు. ఈ సినిమా అనుకున్నాక నేను ధోనితో మాట్లాడింది మూడే మూడుసార్లు. ఒకసారి తన సినిమా చేస్తున్నందుకు ఎలా ఫీలవుతున్నాడో అడిగాను. ఇంకోసారి అతడి మనస్తత్వం ఎలా ఉంటుందో.. ఏ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడో తెలుసుకోవడానికి 250 దాకా ఊహాజనితమైన ప్రశ్నలు అడిగాను. మూడోసారి స్క్రిప్టులో రాసిన కొన్ని సంఘటనల గురించి అతడితో మాట్లాడాను'' అని సుశాంత్ తెలిపాడు. ధోని స్వతహాగా వికెట్ కీపర్ కావడంతో మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె ఆధ్వర్యంలో తాను క్రికెట్ శిక్షణ తీసుకున్నట్లు సుశాంత్ తెలిపాడు. 13 నెలల పాటు తన శిక్షణ సాగినట్లు అతను వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు