ఈగ-2 తీయాల్సిందే అంటున్న నాని

ఈగ-2 తీయాల్సిందే అంటున్న నాని

నాని కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ‘ఈగ’. అలాగే రాజమౌళి సినిమాల్లో కూడా ‘ఈగ’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా సీక్వెల్ గురించి అప్పుడప్పుడూ ఊహాగానాలు తెరమీదికి వస్తుంటాయి. ఓ సందర్భంలో రాజమౌళి కూడా ‘ఈగ’కు సీక్వెల్ తీస్తే బాగానే ఉంటుందని మాట్లాడాడు. ఐతే ఈ దిశగా ఎప్పుడూ కాంక్రీట్‌గా అడుగులు పడింది లేదు. ఐతే నాని మాత్రం ఏదో ఒక రోజు ‘ఈగ’ సీక్వెల్ తీయాల్సిందే అంటున్నాడు. సీక్వెల్లో తనకు ఛాన్సిచ్చినా ఇవ్వకున్నా ఈ సినిమాకు సీక్వెల్ రావాలని మాత్రం తాను కోరుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నాని.

‘‘ఈగ-2 గురించి ఎప్పుడూ వార్తలు చదువుతూనే ఉంటా. అది నిజమైతే బాగుంటుందని అనుకుంటుంటా. కానీ ఆ ప్రాజెక్టు విషయంలో ఇప్పటిదాకా ఏ అప్ డేట్ లేదు. రాజమౌళి గారిని ఎప్పుడు కలిసినా ఈగ-2 గురించి అడుగుతూనే ఉంటా. ‘ఈగ’ సినిమాకు ఓ అభిమాని.. దానికి సీక్వెల్ రావాలని కోరుకుంటా. ఐతే ‘ఈగ’ ఫస్ట్ పార్ట్‌లో నా పాత్ర చనిపోతుంది కాబట్టి టెక్నికల్‌గా చూసుకుంటే సీక్వెల్లో నాకు చోటు ఉండకూడదు. అయినప్పటికీ ‘ఈగ’ సీక్వెల్ తీయాలని నా కోరిక. ఐతే ఈ విషయంలో ఏ నిర్ణయమైనా రాజమౌళి గారే తీసుకోలేదు. నేనైతే ఆ ప్రాజెక్టు విషయంలో చాలా ఆసక్తితో ఉన్నా’’ అని నాని చెప్పాడు. ఐతే ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘ఈగ’ లాంటి సినిమా కూడా ఆయన స్థాయికి ఇప్పుడు చిన్నదే. బాహుబలి-2 తర్వాత మరో భారీ ప్రాజెక్టు దిశగా సన్నాహాలు చేసుకుంటున్నాడు జక్కన్న. మరి నాని కోరికను నెరవేరుస్తాడో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు