జక్కన్న పుట్టి 15 ఏళ్లయింది

జక్కన్న పుట్టి 15 ఏళ్లయింది

రాజమౌళి.. ఈ రోజు దేశమంతా ఈ పేరు చెబితే ఊగిపోతోంది. అతడు తీస్తున్న సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సౌత్.. నార్త్ అని తేడా లేకుండా కోట్లాది మంది అతడికి అభిమానులుగా మారిపోయారు. ఇంతటి అభిమానం సంపాదించుకున్న రాజమౌళి ప్రస్థానం.. మొదలై ఇవాళ్టికి సరిగ్గా 15 ఏళ్లయింది. దశాబ్దంన్నర కిందట అసలేమాత్రం అంచనాల్లేకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు రాజమౌళి.

రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ‘శాంతి నివాసం’ సీరియల్ డైరెక్ట్ చేసి.. దర్శకుడిగా తన తొలి సినిమాను కూడా తన గురువు పర్యవేక్షణలోనే మొదలుపెట్టాడు రాజమౌళి. ఆ చిత్రమే ‘స్టూడెంట్ నెం.1’. ‘నిన్ను చూడాలని’ లాంటి ఫ్లాప్ సినిమాతో హీరోగా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి ఈ సినిమా మొదలుపెట్టినపుడు అసలేమాత్రం అంచనాల్లేవు. విడుదలకు ముందు కీరవాణి పాటలు హిట్టవడంతో సినిమాకు కొంచెం ప్రచారం వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో సినిమా రిలీజైంది.

సినిమా పర్వాలేదు అన్న టాక్‌తో నెమ్మదిగా పుంజుకున్న ‘స్టూడెంట్ నెం.1’ తర్వాత అంచనాల్ని మించిపోయింది. సూపర్ హిట్టయింది. దర్శకుడిగా రాజమౌళి.. హీరోగా ఎన్టీఆర్ సక్సెస్ రుచి చూశారు. ఐతే ఈ సినిమా విషయంలో రాజమౌళికి అనుకున్న స్థాయిలో క్రెడిట్ రాలేదు. అందుకు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ రాఘవేంద్రరావు కావడమే కారణం. పైగా పాటల్లో దర్శకేంద్రుడి ముద్ర కూడా స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ‘సింహాద్రి’తో తన ‘ముద్ర’ వేశాడు రాజమౌళి.
అయినప్పటికీ ‘స్టూడెంట్ నెం.1’ను రాజమౌళి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకుంటాడు. రాజమౌళిని ‘జక్కన్న’ అని రాజీవ్ కనకాల పిలవడం.. దాన్ని ఎన్టీఆర్ పాపురల్ చేయడం ‘స్టూడెంట్ నెం.1’ సమయంలోనే జరిగింది. రాజమౌళి ఇప్పుడున్న స్థాయితో పోల్చుకుని ఇప్పుడు చూస్తే.. ‘స్టూడెంట్ నెం.1’ చాలా మామూలుగానే అనిపించొచ్చు. ఐతే అలాంటి సినిమాతో మొదలుపెట్టి 15 ఏళ్లలో దేశమంతా మెచ్చిన ‘బాహుబలి’ని తీసే స్థాయికి జక్కన్న ఎదిగిన తీరుకు అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు