శింబు.. వయసు 60.. బరువు 95 కిలోలు

శింబు.. వయసు 60.. బరువు 95 కిలోలు

తన సినిమాల కంటే కూడా వేరే విషయాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు తమిళ హీరో శింబు. అనవసర వివాదాల కారణంగా అతడి కెరీర్ బాగా దెబ్బ తింది. కొన్ని సినిమాలు ఏళ్లకు ఏళ్లు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. ఐతే ఈ మధ్య అతి కష్టం మీద ఒక్కో సినిమాను క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు శింబు. గత ఏడాది 'వాలు' రిలీజైతే.. ఈ ఏడాది 'ఇదు నమ్మ ఆలు' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇక 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వెర్షన్ 'అచ్చం ఎన్బదు మదమాయిద'ను కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్ ఉన్న ఒక పాటను శింబు ఈ మధ్యే పూర్తి చేశాడు. మరోవైపు తన కొత్త సినిమా 'ఎఎఎ' కోసం బాగానే కష్టపడుతున్నాడు శింబు.

'త్రిష ఇల్లాన నయనతార' ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు మూడు రకాల పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఇందులో ఓ పాత్ర కోసం 60 ఏళ్ల ముసలివాడిగా కనిపిస్తాడట శింబు. అతడి బరువు కూడా 95 కిలోలుంటుందట. అందుకోసం శింబు బరువు పెరిగే పనిలో పడ్డాడట. ఆ మధ్య 'సైజ్ జీరో' అనుష్క ఇలాగే బాగా బరువు పెరిగి.. మళ్లీ తగ్గడానికి అష్టకష్టాలు పడింది. మరి శింబు ఏం చేస్తాడో చుూడాలి. వయసు మళ్లిన పాత్రల్లో నటించడం తమిళ హీరోలకు మహా సరదా. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. రూపం మార్చుకుంటారు. చాలా కష్టమైన మేకప్స్ ట్రై చేస్తుంటారు. శింబు ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. తొలిసారి ముసలివాడి పాత్ర వేయబోతున్నాడు. తమన్నా, శ్రియ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు