ధోని సినిమాకు పెద్ద బూస్టే..

ధోని సినిమాకు పెద్ద బూస్టే..

ఇంకో ఐదు రోజులే మిగిలుంది.. టీమ్ ఇండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథతో తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ’ విడుదలకు. మామూలుగా బయోపిక్స్ అంటే.. ఓ వర్గం ప్రేక్షకులకే ఆసక్తి ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన బయోపిక్స్ పర్వాలేదనిపించాయి కానీ.. మరీ రెగ్యులర్ సినిమాల తరహాలో ఆదరణ పొందలేదు. ఐతే ‘ఎం.ఎస్.ధోని’ మాత్రం  ఇందుకు మినహాయింపు లాగే కనిపిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాల తరహాలో దీనికి మాంచి క్రేజ్ వచ్చింది. బంపర్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. కచ్చితంగా భారీ వసూళ్లు కూడా సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మినిమం రూ.300 కోట్ల వసూళ్లు గ్యారెంటీ అన్నది అంచనా.

ఫుల్ పాజిటవ్ బజ్ మధ్య రిలీజవుతున్న ధోని సినిమాకు.. ధోని సొంత రాష్ట్రం మంచి సపోర్ట్ ఇచ్చింది. తమ రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేసిన ధోని మీద తీసిన సినిమాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సహా ఏ పన్నూ వేయకూడదని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ధోని తమ హీరో అని.. ఆయన గౌరవార్థం పన్ను వేయట్లేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎ వెడ్నస్ డే.. స్పెషల్ చబ్బీస్.. బేబీ లాంటి మంచి సినిమాలు తీసిన నిరజ్‌పాండే ‘ఎం.ఎస్.ధోని’కి దర్శకత్వం వహించాడు. ఇందులో ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కనిపించనున్నాడు. దిశా పటాని.. అనుపమ్‌ ఖేర్‌.. భూమిక చావ్లా ముఖ్య పాత్రలు పోషించారు. ఈనెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. తెలుగులోనూ ఈ చిత్రం విడుదలవుతుండటం విశేషం.