వెండితెర ధోని అంత కష్టపడ్డాడు

వెండితెర ధోని అంత కష్టపడ్డాడు

ఏమో అనుకున్నాం కానీ.. టీమ్ఇండియా గ్రేటెస్ట్ ఎవర్ కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని మీద తీసిన సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు. ‘ఎం.ఎస్.ధోని’ చిత్రం.. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా బంపర్ క్రేజ్‌ మధ్య రిలీజవుతోంది ఈ నెల 30న. ముందు ధోని మీద సినిమా అంటే ఏముంటుందిలే అని లైట్ తీసుకున్నారు కానీ.. ట్రైలర్ చూశాక జనాల అభిప్రాయం మారింది. ధోని సినిమా చాలా ఎగ్జైటింగ్‌గా ఉండబోతోందని అర్థమైంది. ఈ సినిమా ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తుండటంతో క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ధోని స్వయంగా రంగంలోకి దిగి ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటం విశేషం.

ఇంతకుముందు మిల్కా సింగ్ మీద వచ్చిన బయోపిక్ ‘బాగ్ మిల్కా బాగ్’లో మిల్కాసింగ్ పాత్రను ఫర్హాన్ అక్తర్ ఎంత అద్భుతంగా పోషించాడో.. ధోని పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా అంతే చక్కగా చేశాడని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ధోని పాత్రలో సుశాంత్‌ను యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమా ఈజీగా జనాలకు కనెక్టవుతుందని అర్థమైంది. ధోని బాడీ లాంగ్వేజ్‌ను కానీ.. అతడి షాట్లను కానీ తెరమీద దించేసినట్లే ఉన్నాడు సుశాంత్. ధోని సైతం.. తన పాత్ర పోషించడానికి సుశాంత్ ఎంత కష్టపడ్డాడో వివరించాడు. సుశాంత్ తొమ్మిది నెలల పాటు క్రికెట్ మైదానంలో ఉండి.. తనను అనుకరించడానికి సాధన చేసినట్లు ధోని చెప్పాడు. రోజూ తన వీడియోలు చూస్తూ మూణ్నాలుగు గంటల పాటు క్రికెట్ సాధన చేస్తూ తన పాత్రలోకి ఒదిగిపోయాడన్నాడు. ఒకరి బాడీ లాంగ్వేజ్‌ను ఇంకొకరు అనుకరించడం కష్టమని.. ముఖ్యంగా క్రికెటింగ్ షాట్లను అనుకరించడం అంటే చిన్న విషయం కాదని ధోని అన్నాడు. తన ఆలోచన విధానాన్ని కూడా సుశాంత్ అర్థం చేసుకుని.. తనలా ప్రవర్తించడానికి చాలానే కష్టపడ్డట్లు ధోని చెప్పాడు. సుశాంత్ పడ్డ కష్టం ఫలించి ధోని పాత్ర అతడి కెరీర్లో ఓ మైలురాయిలాగే నిలిచిపోయేలాగే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు