ఫిక్సయిపోండి.. పవన్ సినిమా రీమేకే

ఫిక్సయిపోండి.. పవన్ సినిమా రీమేకే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. పవన్ కళ్యాణ్ కూడా సెట్లోకి అడుగుపెట్టేశాడు. మూడు నెలల్లో సినిమా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది డాలీ అండ్ టీమ్. స్క్రిప్టు కూడా పక్కాగా ఉండటంతో అదేమంత కష్టం కూడా కాదంటున్నారు. పవన్ అనుకున్న ప్రకారం షూటింగుకి వస్తే ఈ ఏడాది ఆఖరుకల్లా సినిమా పూర్తయిపోవచ్చు. పవన్.. త్రివిక్రమ్ సినిమా మీద దృష్టిపెట్టొచ్చు. ఇక ‘కాటమరాయుడు’ కథ గురించి.. అందులోని పాత్రల గురించి బయటికి వస్తున్న సమాచారం తెలుసుకుంటుంటే.. ఈ సినిమా తమిళ హిట్ ‘వీరం’కు రీమేక్ అని గతంలో జరిగిన ప్రచారం వాస్తవమే అని అర్థమవుతోంది.

పవన్ ఇందులో మిడిలేజ్డ్ ఫ్యాక్షనిస్టు పాత్ర పోషిస్తున్నాడట. అతడికి నలుగురు అన్నదమ్ములుంటారట. అందులో ఇద్దరు కమల్ కామరాజు.. విజయ్ దేవరకొండ అని తేలిపోయింది. ‘కీచక’ ఫేమ్ యామిని భాస్కర్.. మరో కొత్తమ్మాయి మానస హిమవర్ష.. హీరో తమ్ముళ్లను ప్రేమించే అమ్మాయిలుగా కనిపించబోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది ‘వీరం’ రీమేక్ మాదిరే అనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి ముందు దర్శకుడు అనుకున్న ఎస్.జె.సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇచ్చిన హింట్లు కూడా ఇది ‘వీరం’ రీమేకే అన్న అభిప్రాయం కలిగించాయి. ‘వీరం’ సినిమా కొంచెం ‘పెద్దరికం’ ఛాయలతో ఉంటుంది. ఈ సినిమాలో హీరోకు ఆడవాళ్లంటే పడదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఐతే అతడి నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. అది అన్నయ్య అంగీకరించడని భావించి.. అతడినే ఓ అమ్మాయి ప్రేమలోకి దించుతారు. ఇలా సాగుతుంది ‘వీరం’ కథ. ‘వీరం’ సినిమాను పవన్‌కు సన్నిహితుడైన ఎ.ఎం.రత్నం నిర్మించడం విశేషం. పవన్‌తో ‘ఖుషి’ తర్వాత మరో సినిమా చేయాలని భావిస్తున్న రత్నం.. ‘వీరం’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చుకుని తీసుకునే సౌలభ్యాన్ని ఇచ్చారని.. కాబట్టి ‘కాటమరాయుడు’ రీమేక్ కాని రీమేక్ అని కూడా అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు