విశాఖను రక్షించేందుకు గుజరాత్ నుంచి రసాయనం

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన స్టెరీన్ వాయువు ఎంతటి తీవ్ర పరిణామలకు దారి తీసిందో తెలిసిందే. ఇప్పటికే దీని వల్ల 11 మంది మృతి చెందినట్లు సమాచారం వస్తోంది. ప్రాథమికంగా మృతుల సంఖ్య 8 అనే అన్నారు కానీ.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇంకో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇంకా వందల మంది అస్వస్థతతో చికిత్స తీసుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం, దాదాపు అయిదు గ్రామాల్లో ఈ గ్యాస్ ప్రభావం ఉంది. వాటర్ స్టెరిలైజేషన్‌తో గ్యాస్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. దాని వల్ల ప్రమాద స్థాయి తగ్గుతుంది కానీ.. పూర్తిగా తొలగిపోదు. గ్యాస్ ప్రభావం ఉన్న చోట జనాలందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పని ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్న ప్రభుత్వ సిబ్బందికి కూడా ముప్పు పొంచి ఉంది.

స్టెరీన్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించాలంటే పీబీటీసీ అనే రసాయనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఐతే ఆ రసాయనం ఏపీలో ఎక్కడా అందుబాటులో లేదు. గుజరాత్‌లో ఆ రసాయన నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అత్యవసరంగా పీబీటీసీ రసాయనాన్ని పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ నుంచి 500 కేజీల పీబీటీసీ రసాయనాన్ని ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తెప్పిస్తున్నారు.

గ్యాస్ ప్రభావం కనీసం 24 గంటల పాటు ఉంటుంది. అలాగే పరిశ్రమ ట్యాంకర్లలోని హైడ్రో కార్బన్లలో చైన్ రియాక్షన్ జరిగి మళ్లీ ప్రమాదం చోటు చేసుకుని మరింతగా స్టెరీన్ గ్యాస్ లీకయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా పీబీటీసీ ద్రావణాన్ని తెప్పిస్తున్నారు. మరోవైపు ఎల్టీ పాలిమర్స్ కంపెనీకి చెందిన ఉన్నత స్థాయి నిపుణులు ప్లాంటులో స్టెరీన్‌ గ్యాస్‌ను నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.