'సుడిగాడు'కు సీక్వెల్ వస్తోంది

'సుడిగాడు'కు సీక్వెల్ వస్తోంది

అల్లరి నరేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా 'సుడిగాడు'. పది కోట్ల మార్కు కూడా ఎప్పుడూ అందుకోని అల్లరోడు.. ఈ సినిమాతో రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. తమిళ హిట్ మూవీ 'తమిళ్ పడం'కు రీమేక్‌గా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం ఇది. తెలుగులో సూపర్ హిట్టయిన చాలా సినిమాల పేరడీలు.. స్పూఫ్‌లతో మంచి వినోదం పండించాడు భీమనేని. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. 'సుడిగాడు' తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'స్పీడున్నోడు' చేసి దెబ్బ తిన్న భీమనేని.. కొంచెం గ్యాప్ తీసుకుని తన బలమైన కామెడీ సినిమాతో రాబోతున్నాడు. అల్లరోడితో సుడిగాడు-2' చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రాన్ని కూడా భీమనేనే స్వయంగా నిర్మిస్తాడట.

అల్లరి నరేష్ చివరగా హిట్టు కొట్టింది 'సుడిగాడు'తోనే. కాకపోతే ఆ సినిమా మంచి ఫలితాన్నే ఇచ్చినా.. అతడి కెరీర్‌ను దెబ్బ కొట్టింది. అప్పటిదాకా పేరడీలతో బాగానే నెట్టుకొచ్చేవాడు నరేష్. కానీ ఈ సినిమా అంతా పేరడీలే కావడంతో డోస్ ఎక్కువైపోయింది. ఆ సినిమా వరకు ఓకే కానీ.. ఆ తర్వాత మాత్రం జనాలకు మొహం మొత్తింది. అతను పేరడీలు చేస్తే జనాలకు నచ్చలేదు. వరుసగా అలా చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. నాలుగేళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్నాడు నరేష్. ఇప్పుడు మళ్లీ పేరడీలతో సినిమాను నింపేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దీని కంటే ముందు నరేష్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇంట్లో దయ్యం నాకేంటి భయ్యం వచ్చే నెలలో రిలీజవుతుండగా.. అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు