సిద్ధార్థ్-రాశి ఖన్నా.. భలే కాంబినేషన్

సిద్ధార్థ్-రాశి ఖన్నా.. భలే కాంబినేషన్

ముందు బాలీవుడ్లో 'మద్రాస్ కేఫ్'తో హీరోయిన్‌గా పరిచయమైంది రాశి ఖన్నా. ఆ తర్వాత తెలుగులోకి వచ్చి 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోయిన్‌గా సెటిలైంది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు మంచి అవకాశాలే చేతిలో ఉన్నాయి. ఇప్పుడామె తమిళంలోకి కూడా వెళ్లిపోతుండటం విశేషం. ఒకప్పుడు తెలుగులో హవా సాగించి.. ఆ తర్వాత తమిళంలోకి షిఫ్ట్ అయిపోయిన చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్ సరసన ఆమె నటించబోతుండటం విశేషం. 'సైతాన్ కా బచ్చా' అనే తమాషా టైటిల్‌తో ఓ వెరైటీ సినిమా చేయబోతున్నాడు సిద్ధార్థ్. అందులో రాశిని కథానాయికగా ఎంచుకున్నాడు. తెలుగులో 'పాండ‌వుల్లో ఒక‌డు' పేరుతో రిలీజైన 'క‌ప్ప‌ల్' సినిమా ద‌ర్శ‌కుడు కార్తీక్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు చేస్తున్న సినిమా ఇది. టైటిల్ చూస్తే హార్రర్ కామెడీయేమో అనిపిస్తోంది. ఐతే ఇదొక నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అంటున్నాడు సిద్ధు.

తెలుగు నుంచి తమిళంలోకి వెళ్లాక వరుస హిట్లు అందుకున్న సిద్ధు.. ఆ తర్వాత కావ్య తలైవన్.. జిల్ జంగ్ జక్ లాంటి ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. వీటి తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న సిద్ధు.. ఇప్పుడు వరుసగా సినిమాలు కమిటవుతున్నాడు. 'బిచ్చగాడు' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శశి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్న సిద్ధు.. మలయాళంలో స్టార్ హీరో దిలీప్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. దీంతో పాటు త‌మిళం-తెలుగు-హిందీల్లో భారీ బ‌డ్జెట్ త్రిభాషా చిత్రం కూడా చేస్తాడ‌ట సిద్ధు. అతడి సంగతెలా ఉన్నా.. తమిళంలో తొలి సినిమా vచేయబోతున్న రాశి ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు