ఆ మాటంటే భయమేస్తోందంటున్న అవసరాల

ఆ మాటంటే భయమేస్తోందంటున్న అవసరాల

దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ చూసినా.. రెండో సినిమా ‘జ్యో అచ్యుతానంద’ గమనించినా.. చాలా వరకు అచ్చ తెలుగు మాటలే ఉంటాయి. అతడిలో మంచి రచయిత కనిపిస్తాడు. భాష మీద.. సాహిత్యం మీద పట్టు ఉన్న సంగతి అర్థమవుతుంది. ‘జ్యో అచ్యుతానంద’లో ‘చివరికి మిగిలేది’ పుస్తకం గొప్పదనాన్ని చెప్పడం చూస్తే.. అతడికి తెలుగు సాహిత్యం మీద ఉన్న గౌరవం కూడా తెలుస్తుంది. ఐతే అందరూ అనుకుంటున్నట్లు తనకు భాష మీద అంత పట్టులేదని.. జనాలు ఈ విషయంలో తనమీద పెట్టుకున్న అంచనాలు చూస్తే భయమేస్తోందని.. తనను కొందరు తెలుగు భాష పరిరక్షకుడిగా కొందరు కీర్తించేస్తుండటం చూస్తే ఎలా స్పందించాలో తెలియట్లేదని అవసరాల చెప్పాడు.

‘‘నాకు తెలుగు భాష ప్రతినిధి అని.. భాషా పరిరక్షకుడు అని కొందరు ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. ఇలాంటివన్నీ వింటుంటే ఎలా స్పందించాలో అర్థం కాలేదు. భయమేసింది. నేను స్క్రిప్టులు రాయడం మొదలుపెట్టినపుడు నాకు తెలుగు మీద అంత పట్టు లేదు కదా అని కంగారుపడ్డాను. ఊహలు గుసగుసలాడే సినిమాలో నేను కొంచెం గ్రాంథిక మాటలు రాశానని ఎవరో అన్నారు. అవేంటో నాకు అర్థం కాలేదు. నిజానికి నాకు తెలుగు మీద అంత పట్టు లేదు’’ అని అవసరాల అన్నాడు. తాను తెలుగు సాహిత్యం ముందు నుంచి చదువుతున్నానని.. ఇప్పుడు తన మీద పెట్టుకున్న అంచనాల్ని అందుకోవడం కోసం మరింతగా పుస్తకాలు చదువుతున్నానని అవసరాల తెలిపాడు. ‘‘నాకు చలం, ముళ్లపూడి వెంకటరమణ గార్ల రచనలంటే ఇష్టం. ఇప్పుడు తెలుగు సాహిత్యం మరింతగా చదువుతున్నాను. ఐతే వాటిని ఆస్వాదించడానికి చదువుతా తప్ప.. ఐడియాల కోసం కాదు. నాకు ఇంగ్లిష్ నవలలు చదివేటపుడే ఎక్కువ ఐడియాలు వస్తాయి’’ అని అవసరాల అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు