'పెళ్లిచూపులు' స్పీడ్ తగ్గలేదు

'పెళ్లిచూపులు' స్పీడ్ తగ్గలేదు

చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం నమోదు చేసింది 'పెళ్లిచూపులు'. ఇంటాబయటా మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్స్ లిస్ట్ లో చేరింది. తరుణ్ భాస్కర్ కథ-కథనంతో పాటూ హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి వర్కవుట్ అయింది. స్టోరీ కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు 'పెళ్లిచూపులు'ను ఆదరించారు. యూఎస్ లోనూ ఈ మూవీ 50రోజులు పూర్తిచేసుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అమెరికాలో యాభై రోజులు కంప్లీట్ చేసుకోవడమంటే మాటలుకాదు. ఎంతో హైప్ తో వచ్చే పెద్ద హీరోల సినిమాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అక్కడి జనాలు ఆదరించరు. అలాంటిది 'పెళ్లిచూపులు'లాంటి చిన్న సినిమా యూఎస్ లో యాభై రోజులు ఆడిందంటే గొప్పే. స్టోరీ టెల్లింగ్ లో కొత్తదనమే అక్కడి ప్రేక్షకులనూ అలరిస్తోంది.

సురేష్ ప్రొడక్షన్ బ్రాండ్ పై విడుదలైన 'పెళ్లిచూపులు' డైరక్టర్ తరుణ్ భాస్కర్. రాజ్ కందుకూరి నిర్మాత. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరోహీరోయిన్లు. జీవితంలో లక్ష్యమంటూ లేని యువకుడు-భవిష్యత్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్న యువతి అనుకోని పరిస్థితుల్లో కలవడం, వారి స్నేహం, ప్రేమ.. చివరికి వాళ్లిద్దరూ కెరీర్ తో పాటూ ప్రేమను ఎలా గెలిపించుకున్నారన్నదే కథ. ఈ సినిమా కథను ఇంత ఈజీగా చెప్పేసుకున్నా.. తెరపై మాత్రం అందమైన కావ్యంలా ఉంటుంది. ఇక సందర్భానుసారం వచ్చే కామెడీ గిలిగింతలు పెడుతుంది.

మంచి కథలో వినోదం మిళితమైతే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడానికి 'పెళ్లిచూపులు' మూవీనే మంచి ఉదాహరణ. లవ్ స్టోరీలన్నీ దాదాపు ఒకే ట్రాక్ లో సాగినా కథను మెప్పించేలా వినూత్నంగా చెప్పడంలోనే సక్సెస్ ఫార్ములా ఉంటుంది. ఈ కిటుకును పట్టుకోబట్టే డైరక్టర్ తరుణ్ భాస్కర్ తొలిచిత్రంతోనే మంచి విజయం సాధించాడు.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు