దయచేసి అలా చేయొద్దంటున్న మోహన్ బాబు

దయచేసి అలా చేయొద్దంటున్న మోహన్ బాబు

తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు మోహన్ బాబు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ వేడుకకు రంగం సిద్ధం చేసింది మంచు ఫ్యామిలీ. తెలుగుతో పాటు మిగతా సినీ పరిశ్రమల నుంచి అతిరథ మహారథులు ఈ వేడుకకు వస్తున్నారు. ఎందరో రాజకీయ ప్రముఖులు.. పారిశ్రామిక వేత్తలు కూడా హాజరవుతున్నారు. విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ 'నవరస నటతిలకం' బిరుదుతో మోహన్ బాబును సత్కరించనుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. నా కోసం వస్తున్న అభిమానులెవరూ పూలదండలు, బొకేలతో రావొద్దు. ఇంకా ఏ రకమైన హడావుడి కూడా చేయొద్దు. తన కోసం ఖర్చు పెట్టే డబ్బులతో ఎలాంటి ఆసరా లేని నిస్సహాయులకు, అన్నార్తుల సాయం చేయండి. పట్టెడన్నం పెట్టండి. నేను చాలా సంతోషిస్తాను.

ఇక 40 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకోవడం గురించి మోహన్ బాబు స్పందిస్తూ.. ''ఈ ఆనందం మాటల్లో చెప్పలేను.. సినీ జీవితంలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు గడిచి పోయింది. మా గురువు దాసరి నారాయణరావు, నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధించిన అభిమానుల వల్లే నేను ఇంతవరకు ప్రయాణం సాగించగలిగాను. ఈ 40 ఏళ్ల పండుగ విశాఖలో జరుపుకునే అవకాశం రావడం నా జీవితంలో మర్చిపోలేను. ఓ మారుమూల పల్లెటూరు నుంచి పొట్ట చేతపట్టుకుని మద్రాసు వెళ్లాను. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎదురు దెబ్బలు తిన్నాను. గురువుగారు నన్ను మోహన్‌బాబుగా మార్చి తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. ఆయన  ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల దయవల్ల ఎన్నో విజయాలందుకున్నాను. కళామతల్లి సేవలో అప్పుడే 40 ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు. నేను ఏ వేషం వేసినా.. ఏ ప్రయోగం చేసినా తెలుగు ప్రజలు ఆదరించారు. ఎందరో మహానుభావులు నా కోసం ఈ వేడుకలో పాల్గొని నన్ను ఆశీర్వదించేందుకు తరలివస్తున్నారు. చాలా సంతోషం'' అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English