క్షణం రీమేక్ లోనూ ఆమేనండోయ్

క్షణం రీమేక్ లోనూ ఆమేనండోయ్

ఈ ఏడాది సెన్సేషనల్ హిట్లలో ఒకటి ‘క్షణం’. పెట్టుబడి.. రాబడి పోల్చి చూస్తే అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగానూ చెప్పొచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో హాలీవుడ్ ప్రమాణాలతో చక్కటి థ్రిల్లర్ అందించింది అడివి శేష్ అండ్ కో. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న ఆదా శర్మకు ‘క్షణం’ రూపంలో చాన్నాళ్ల తర్వాత ఓ బ్రేక్ లభించింది. కానీ ఆ సినిమా తర్వాత అనుకున్న స్థాయిలో ఆమె బిజీ కాలేకపోయింది. ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న ఆమెకే ‘క్షణం’ రూపంలోనే మరో అవకాశం లభించింది. ‘క్షణం’ తమిళ రీమేక్‌లోనూ ఆదానే హీరోయిన్‌గా ఎంపికైంది.

తెలుగులో కొందరు వారసుల్లాగే మంచి బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయమై దశాబ్ద కాలం నుంచి హిట్టు కోసం పోరాడుతున్న సత్యరాజ్ కొడుకు శిబిరాజ్.. ‘క్షణం’ రీమేక్‌లో అడివి శేష్ పాత్రను పోషిస్తున్నాడు. అతడికి అక్కడ హిట్టు చాలా చాలా అవసరం. దీంతో ‘క్షణం’ రైట్స్ తీసుకుని సొంత బేనర్లో రీమేక్ చేయబోతున్నాడు. తెలుగులో ఆదా తన పాత్రను చాలా బాగా చేయడంతో తమిళంలోనూ ఆమెకే అవకాశమిచ్చారు. ఈ ఏడాదే శింబు సినిమా ‘ఇదు నమ్మ ఆళు’లో ఓ స్పెషల్ సాంగ్ చేసిన ఆదా.. ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్‌తో తమిళంలోకి అడుగుపెడుతోంది. అక్కడైనా ఆమె నిలదొక్కుకుంటుందేమో చూడాలి. మరోవైపు ‘క్షణం’ బాలీవుడ్లోనూ రీమేక్ కాబోతోంది. అక్కడ ఆదాకు ఛాన్సిస్తారా.. ఇంకో హీరోయిన్ని ఎంచుకుంటారా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు