స్లమ్‌ డాగ్‌ కుర్రాడి మరో సెన్సేషనల్‌ మూవీ

స్లమ్‌ డాగ్‌ కుర్రాడి మరో సెన్సేషనల్‌ మూవీ

స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయాడు ఇండియన్‌ కుర్రాడు దేవ్‌ పటేల్‌. ఆ సినిమా అతడికి హాలీవుడ్లో మరికొన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. తాజాగా అతను మరో గొప్ప సినిమాలో నటించాడు. 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' తరహాలోనే ఇది కూడా ఆస్కార్‌ అవార్డుల్లో సంచలనాలు సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఆ సినిమా పేరు.. లయన్‌. ఇండియాలో చిన్నతనంలో తన తల్లికి దూరమైన ఓ కుర్రాడు.. అనుకోకుండా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే పెరిగి.. పాతికేళ్ల తర్వాత తన తల్లిని కలుసుకోవడం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇది రియల్‌ స్టోరీ కావడం విశేషం.

మధ్యప్రదేశ్‌కు చెందిన షేరూ మున్షి ఖాన్‌ అనే కుర్రాడు ఐదేళ్ల వయసులో రైల్లో తప్పిపోయి కోల్‌కతాకు చేరాడు. తిరిగి ఇంటికెళ్లే మార్గం తెలియక అక్కడే కొన్నాళ్లు అడుక్కుంటూ పొట్టనింపుకున్నాడు. తర్వాత ఓ వ్యక్తి సాయంతో అనాథాశ్రమంలో చేరాడు. అక్కణ్నుంచి అతణ్ని ఆస్ట్రేలియా దంపతులు దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకెళ్లారు. వారి వద్దే పెరిగిన షేరూ పేరు.. సరూ బ్రియర్లీగా మారింది. అలాగే పెరిగి పెద్దయిన సరూకు సొంతగడ్డపై ప్రేమ మాత్రం చావలేదు. పెద్దయ్యాక వ్యాపారవేత్తగా ఎదిగిన సరూ.. తన తల్లిదండ్రుల్ని కలవాలని తపించాడు. తమ ఊరి పేరులో మొదటి అక్షరం మాత్రమే గుర్తుండటంతో గూగుల్‌ సాయంతో శోధించాడు. ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో సాయం కోసం ప్రయత్నించాడు. మొత్తానికి ఎలాగోలా అతడి కల నెరవేరింది. పాతికేళ్ల తర్వాత మళ్లీ అతను అమ్మ ఒడికి చేరాడు. ఈ ప్రయాణాన్ని 'ఎ లాంగ్‌ వే హోమ్‌' అనే పుస్తకరూపంలోకి తెచ్చాడు. ఆ కథతోనే 'లయన్‌' సినిమా తెరకెక్కింది. ఈ కుర్రాడి పాత్రలో దేవ్‌ పటేల్‌ నటించగా.. అతడి ఆస్ట్రేలియా తల్లిగా ప్రముఖ హాలీవుడ్‌ నటి నికోల్‌ కిడ్‌మన్‌ కనిపించడం విశేషం. గర్థ్‌ డేవిస్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై.. ప్రశంసలుంందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డు కూడా గ్యారెంటీ అనేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

Also Read:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు