‘మజ్ను’లో రాజమౌళి ఒక్కడే కాదా..?

‘మజ్ను’లో రాజమౌళి ఒక్కడే కాదా..?

‘మజ్ను’ ట్రైలర్లో నాని ‘బాహుబలి’లోని భల్లాల దేవుడి రథం మీద రావడం గమనించే ఉంటారు. అది చూడగానే ఈ సినిమాకు.. ‘బాహుబలి’కి లింకేంటబ్బా అని సందేహం కలిగింది చాలామందికి. ఇంతలోనే ఈ సినిమాలో నాని రాజమౌళికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపిస్తాడన్న గుసగుసలు వినిపించాయి. ఐతే నిజమా కాదా అని సందేహిస్తున్న వారికి నానినే స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో రాజమౌళి క్యామియో ఉంటుందంటూనే ఓ మెలిక పెట్టాడు.

‘‘మజ్నులో నేను ఆదిత్య అనే కుర్రాడిగా కనిపిస్తా. ‘బాహుబలి’ సినిమాకి సహాయ దర్శకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళిగారి దగ్గర పనిచేస్తుంటా. ఈ సినిమాలో రాజమౌళిగారు ఒక్కరే కనిపిస్తారా? ‘బాహుబలి’ బృందం కూడా కనిపిస్తుందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గతంలో నేను కూడా సహాయ దర్శకుడిగా పని చేయడంతో ఈ సినిమా చేస్తున్నపుడు నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి’’ అని నాని చెప్పాడు.

ఈ మధ్య తాను యువ దర్శకులతోనే పని చేస్తున్నానని.. ఐతే రాజమౌళి లాంటి దర్శకులు అడిగితే మరో ఆలోచన లేకుండా సినిమా చేస్తానని నాని చెప్పాడు. ‘‘నా వయసు హీరోల్లో పెద్ద దర్శకులతో ఎక్కువ సినిమాలు చేసినవాణ్ని నేనే.  రాజమౌళి, కృష్ణవంశీ, గౌతమ్‌ మీనన్‌, సముద్రఖని లాంటి సీనియర్ డైరెక్టర్లతో పని చేశా. అగ్ర దర్శకులు ఎవరైనా నా శైలికి తగ్గ కథ చెబితే తప్పకుండా చేస్తా. రాజమౌళి పిలిస్తే చేస్తున్న సినిమాలన్నీ వదిలేసి పరుగెత్తుకుని వెళ్లిపోతా. ఈ మధ్య యువ దర్శకులు చెబుతున్న కథలు నాకు బాగా నచ్చుతున్నాయి. ప్రస్తుతం ‘నేను లోకల్‌’ చేస్తున్నా. ఆ తర్వాత డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఓ సినిమా ఉంటుంది’’ అని నాని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు