రాజమౌళి.. ఒక మంచి రివ్యూయర్‌

రాజమౌళి.. ఒక మంచి రివ్యూయర్‌

రాజమౌళి అంత పెద్ద దర్శకుడైనా సరే.. చాలా సింపుల్‌గా ఉంటాడు. ఏదైనా సినిమా ప్రోమోస్‌ ఆసక్తికరంగా అనిపిస్తే రిలీజ్‌ డే 8.45 షోకి ప్రసాద ఐమాక్స్‌లో వాలిపోతాడు. సామాన్య ప్రేక్షకుల నడుమ సినిమా చూస్తాడు. సినిమా బాగుంటే వెంటనే దాని గురించి నాలుగు మంచి మాటలు ట్విట్టర్లో పోస్ట్‌ చేస్తాడు. ఈ మధ్య కాలంలో పెళ్లిచూపులు.. మనమంతా లాంటి సినిమాల గురించి గొప్పగా మాట్లాడాడు జక్కన్న. అలాగే తన ఆప్తమిత్రుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా 'జనతా గ్యారేజ్‌' కూడా చూసి.. అందులో తనకు నచ్చిన అంశాల గురించి ట్విట్టర్లో ప్రస్తావించాడు. తాజాగా రాజమౌళి ఇంకో సినిమా చూశాడు. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తన ఫ్రెండ్‌.. 'ఈగ' ప్రొడ్యూసర్‌ సాయి కొర్రపాటి నిర్మించిన 'జ్యో అచ్యుతానంద'ను ఈ ఉదయమే వీక్షించిన అనంతరం ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు గుప్పించాడు.

అవసరాల శ్రీనివాస్‌, సాయికొర్రపాటిల కాంబినేషన్‌ మరోసారి చక్కటి ఫ్యామిలీ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌ను అందించిందని.. ఎక్కడా ఓవర్‌ ద టాప్‌ అనిపించకుండా.. ఫోర్స్డ్‌గా అనిపించకుండా చక్కటి వినోదం పంచిందని.. చివరి 10 నిమిషాల్లో సినిమా హృదయాన్ని తడుతుందని అన్నాడు రాజమౌళి. నారా రోహిత్‌, నాగశౌర్య అన్నదమ్ములుగా చక్కగా కుదిరారని.. రెజీనా నటించిన సినిమాను తాను చూడటం ఇదే తొలిసారని.. ఆమె చక్కగా నటించిందని.. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామ కూడా గొప్ప పనితనం చూపించాడని.. వెంకట్‌ సినిమాటోగ్రఫీ కూడా బాగుందని కితాబిచ్చాడు జక్కన్న. సినిమాలో చివరికి మిగిలేది నవలకు కలిపిన లింకును కూడా రాజమౌళి ప్రస్తావించాడు. అందరికీ అభినందనలు తెలిపాడు. ఐతే తన కజిన్‌ కళ్యాణి మాలిక్‌ గురించి చెప్పడం మాత్రం మరిచిపోయాడు జక్కన్న. తనవాడి గురించి చెప్పడమెందుకనుకున్నాడో ఏంటో? కానీ రాజమౌళి సమీక్ష మాత్రం బాగుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు