ఆ మాట వినీ వినీ అలసిపోయా-నాగ్

 ఆ మాట వినీ వినీ అలసిపోయా-నాగ్

కెరీర్ ఆరంభం నుంచి చాలా ఏళ్ల పాటు తన వాయిస్ విషయంలో విమర్శలు వినీ వినీ అలసిపోయానని చెప్పాడు అక్కినేని నాగార్జున. ఐతే ‘నిర్మలా కాన్వెంట్’ సంగీత దర్శకుడు రోషన్ సాలూరి మాత్రం తన వాయిస్ విషయంలో కితాబివ్వడంతో పాటు తనతో తొలిసారి పూర్తి స్థాయి పాట కూడా పాడించేశాడన్నాడు. ఈ సినిమాలో తన పాత్ర నిడివి ఎక్కువే ఉంటుందని.. ఐతే శ్రీకాంత్ తనయుడు రోషన్ తన భుజాల మీద ఈ సినిమాను మోశాడని నాగ్ అన్నాడు. ‘నిర్మలా కాన్వెంట్’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ నాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘నాగార్జున గొంతు బాగోలేదు.. పేలగా ఉంటుంది.. ఇలాంటి మాటలు నా కెరీర్ ఆరంభంలో చాలామంది అన్నారు. ఆ మాటలు వినీ వినీ అలసిపోయా. కానీ సంగీత దర్శకుడు రోషన్ మాత్రం ‘మీ వాయిస్ బాగుంటుంది. పాట పాడతారా?’ అని అడిగాడు. వెంటనే పాడేశా. శ్రీకాంత్ అంటే నాకు ఇష్టం. ఇద్దరంకలిసి చాలా సినిమాలు చేశాం. వాళ్లబ్బాయి రోషన్ చాలా బాగా నటించాడు. నేను ఓ కీలకమైన పాత్రలో కనిపించా. ద్వితీయార్ధం అంతా ఉంటా. రోషన్ సినిమా అంతా తన భుజాలపై వేసుకుని నడిపించేశాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. కొత్తవాళ్లతో కలిసి చేసిన సినిమా ఇది. అందుకే సెట్లో చాలా ఉల్లాసంగా ఉండేది. ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని నాగ్ అన్నాడు. రోషన్‌ను ఇంత త్వరగా హీరోను చేయాలనుకోలేదని.. అలాగని ‘నిర్మలా కాన్వెంట్’ ఒప్పుకోకపోయి ఉంటే అతను మంచి అవకాశం కోల్పోయి ఉండేవాడని శ్రీకాంత్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు