టీజర్‌ రెస్పాన్స్‌ చూసి బాధపడ్డాడట

టీజర్‌ రెస్పాన్స్‌ చూసి బాధపడ్డాడట

'ఊహలు గుసగుసలాడే' లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అవసరాల శ్రీనివాస్‌. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా 'జ్యో అచ్యుతానంద' మీద కూడా పాజిటివ్‌ బజ్‌ ఉంది. దీని టీజర్‌.. ట్రైలర్‌ రెంటికీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఐతే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ సంతోషాన్నిచ్చినా.. ఈ సినిమా విషయంలో జనాలు పెట్టుకున్న అంచనాలు చూస్తే మాత్రం బాధేసిందంటున్నాడు అవసరాల శ్రీనివాస్‌.

''టీజర్‌ గురించి జనాలు మాట్లాడుకున్న తీరు నాక్కొంచెం బాధ కలిగించింది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్లు ఇది ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ కాదు. అసలిది లవ్‌ స్టోరీ కాదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగే భావోద్వేగభరిత ప్రయాణం. 'ఊహలు గుసగుసలాడే' లాగా ఇది లైట్‌ హార్టెడ్‌ సినిమా కూడా కాదు. ఇందులో ఎమోషన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కథను నడిపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఆ భావోద్వేగాల్ని ఫీలవుతారు. ప్రేక్షకుల్ని ప్రిపేర్‌ చేయడానికే ఈ విషయం చెబుతున్నా. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే నేనేం చెప్పదలుచుకున్నానో అర్థమైపోతుంది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉంటుంది ఈ సినిమా'' అని అవసరాల చెప్పాడు.

దర్శకుడు కావాలన్నది తన పదేళ్ల కల అని.. నటుడిగా మారడానికి ముందే తనకు దర్శకుడయ్యే ఆలోచనలున్నాయని.. 'అష్టాచెమ్మా'కు కూడా తాను దర్శకత్వ విభాగంలో పని చేశానని.. 'గోల్కొండ హైస్కూల్‌'లోనూ తన హ్యాండ్‌ ఉందని అవసరాల చెప్పాడు. తనను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన సాయి కొర్రపాటికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అవసరాల అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు