ప్రభాస్ విలన్.. ముందే బెల్లంకొండతో

మధు గురుస్వామి.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరిది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఈ పేరును గూగుల్‌లో సెర్చ్ చేసి ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలో విలన్ అంటే ఆ మాత్రం ఆసక్తి లేకుండా ఎలా ఉంటుంది మరి? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో ప్రధాన విలన్ పాత్రకు ఈ నటుడే ఎంపికయ్యాడు.

ముందు జాన్ అబ్రహాం అని, ఆ తర్వాత విజయ్ సేతుపతి అని.. ‘సలార్’ విలన్ క్యారెక్టర్ గురించి ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరికేమో ప్రశాంత్ కర్ణాటక దాటి పెద్దగా తెలియని వ్యక్తిని ఆ పాత్రకు ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాలు ‘వజ్రకాయ’, ‘భజరంగి’ల్లో విలన్ పాత్రలతో మధుకు సొంత భాషలో మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత అతను ఓ తెలుగు సినిమాలోనూ మెరిసిన సంగతి చాలామందికి తెలియదు.

ప్రభాస్‌ను ఢీకొట్టడాని కంటే ముందు మధు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌‌కు విలన్‌గా నటించడం విశేషం. శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ రూపొందించిన యాక్షన్ మూవీ ‘సాక్ష్యం’లో విలన్ జగపతిబాబుకు అనుచరుడిగా ఒక రహస్య సామ్రాజ్యాన్ని నడిపే వ్యక్తిగా కనిపించాడు మధు గురుస్వామి.

‘కేజీఎఫ్’లో బానిసలందరినీ ఒక చోట పెట్టి వారితో పని చేయిస్తూ హింసించినట్లే.. ‘సాక్ష్యం’ సినిమాలోనూ ఇలా ఓ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపే కర్కశమైన గూండా పాత్రలో మధు కనిపించాడు. అందులో అతడి అవతారం గగుర్పొడిచేలా ఉంటుంది. కానీ మధు ఎవరన్నది మన జనాలకు అప్పటికి తెలియదు. అతణ్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా ‘సలార్’ లాంటి క్రేజీ పాన్ ఇండియాలో మూవీలో ప్రభాస్‌కు విలన్‌గా నటించబోతున్నాడు మధు. ఈ సినిమాతో వచ్చే గుర్తింపే వేరుగా ఉంటుంది. ప్రశాంత్ మార్కు విలనీ ఉంటే దేశవ్యాప్తంగా అతడికి మంచి పాపులారిటీ రావడం ఖాయం.