కేసీఆర్‌కు పట్టాభిషేకం.. ఓ కోయిల ముందే కూసింది

తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ పట్టాభిషిక్తుడు కావడానికి ఎంతో సమయం లేదన్నది కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ప్రచారం. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, కేటీఆర్ సీఎం కాబోతున్నాడన్న ప్రచారం నిజం కాదని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించినా సరే.. ఆయన మాటల్ని జనాలు నమ్మడం లేదు. కేసీఆర్ ఇలా కొట్టి పారేసిన చాలా విషయాల్లో అందుకు భిన్నంగా జరగడం తెలిసిందే.

కొంత కాలంగా టీఆర్ఎస్ ముఖ్య నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. పార్టీలో, ప్రభుత్వంలో రోజు రోజుకూ కేటీఆర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను బట్టి చూస్తే అతి త్వరలోనే ఆయన సీఎం అయిపోతాడనే సంకేతలు బలంగా కనిపిస్తున్నాయి. ముహూర్తం మరీ దగ్గర పడిపోయిందేమో అనిపించేలా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది చర్చనీయాంశంగానూ మారింది.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అని పేర్కొనకుండా ఆయన ముఖచిత్రం పెద్దదిగా పెట్టి.. కేసీఆర్ చిత్రాన్ని చిన్నది చేసి, పక్కన మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను చేర్చి ఓ టీఆర్ఎస్ కార్యకర్త ‘కంగ్రాచులేషన్’ అని పేర్కొన్న పెద్ద సైజ్ ప్లకార్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్లకార్డ్ ఒక్కటే ఉంటే జనాలకు సందేహం కలిగేది కాదు కానీ.. పెద్ద సంఖ్యలో అలాంటి ప్లకార్డులు ఫొటోలు కనిపిస్తున్నాయి. అంటే సంబరాలకు అంతా సిద్ధం అన్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తే. త్వరలో జరిగే ర్యాలీ కోసం వీటిని సిద్ధం చేశారేమో అనిపిస్తోంది. కాబట్టి పట్టాభిషేకానికి ఎక్కువ సమయం ఏమీ లేదన్నట్లే.

ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీచిన నేపథ్యంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకూడదని, ఆయన నాయకత్వంలోనే తర్వాతి ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్‌ వర్గాల్లో బలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాతి ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఏమో, ఈ లోపు కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్న కోరిక పార్టీలోని మెజారిటీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.