పాపం.. ఎన్టీఆర్‌ కే ఎందుకిలా..?

పాపం.. ఎన్టీఆర్‌ కే ఎందుకిలా..?

ఎన్టీఆర్‌ ఏం పాపం చేసాడు..? ఆయనకే ఎందుకిలా జరుగుతుంది..? మహేశ్‌, బన్నీ లాంటి స్టార్లు ఎవ్వరూ స్టార్లు కాకముందే సూపర్‌ స్టార్‌ కావడమే ఎన్టీఆర్‌ చేసిన నేరమా..? వాళ్ల సినిమాలేవీ రికార్డులు తిరగరాయకముందే.. కేవలం 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే రికార్డులు సృష్టించడమే జూనియర్‌ పాపమా..? ఏజ్‌ కు మించే ఇమేజ్‌ తెచ్చుకోవడమే నందమూరి చిన్నోడు చేసిన దోషమా..? ఏంటి.. ఎన్టీఆర్‌ చేసిన పాపమేంటి..? అసలెందుకు విజయలక్ష్మి ఎన్టీఆర్‌ ను ఇంతగా వేధిస్తోంది..? ఏళ్ల నాటి శని ఏడేళ్లతో పూర్తవుతుందంటారు.. కానీ ఎన్టీఆర్‌ ను మాత్రం పదమూడేళ్లుగా వెంటాడు తూనే ఉంది. పాపం.. సింహాద్రి తర్వాత ఆ స్థాయి హిట్‌ కోసం ఇప్పటి వరకు ఎన్టీవోడు ఎదురు చూస్తూనే ఉన్నాడు.

మధ్యలో యమదొంగ, బృందావనం, అదుర్స్‌, బాద్షా, టెంపర్‌, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు ఓకే అనిపించినా.. అవి తన రేంజ్‌ హిట్లు కావనీ ఎన్టీఆర్‌ కు కూడా బాగా తెలుసు. ఎన్ని సినిమాలు పోయినా.. జనతా గ్యారేజ్‌ తో తనకు పునర్వైభవం వస్తుందని ఎన్టీఆర్‌ తో పాటు ఆయన ఫ్యాన్స్‌ కూడా గట్టిగా నమ్మారు. మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు చేసిన దర్శకుడు కావడంతో జనతా గ్యారేజ్‌ పై ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలేర్పడ్డాయి. కానీ ఈ సినిమా కూడా ఇప్పుడు నిరాశ పరిచింది. యునానిమస్‌ గా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోవడం తీరని లోటే.

జనతా గ్యారేజ్‌ కు తొలిరోజు ఊహించిన టాక్‌ రాలేదు. సినిమా యావరేజ్‌ దగ్గరే ఆగిపోయింది. ఎన్టీఆర్‌ విశ్వరూపం చూపించినా.. మోహన్‌ లాల్‌ ఆకట్టుకున్నా.. డిఎస్పీ మాయ చేసినా.. కొరటాల డైలాగులతో ఆలోచింపచేసినా.. సమంత అందాల విందు చేసినా.. ప్రేక్షకులకు ఇంకేదో మిస్‌ అయినట్లు కనిపించింది. సినిమా చూసినోళ్లకు ఈ విషయం చెప్పనక్కర్లేదు. కథ మరీ పాతదైపోవడం.. దాన్ని కొరటాల సరిగ్గా డీల్‌ చేయలేకపోవడంతో జనతా గ్యారేజ్‌ కాస్త తగ్గింది. మొత్తానికి జనతా గ్యారేజ్‌ తో బ్లాక్‌ బస్టర్‌ కల తీరుతుందని కళ్ళలో ఒత్తులేసుకుని కూర్చున్న ఎన్టీఆర్‌ కు ఈ సినిమా కూడా అదే ఫలితాన్నివ్వడం రుచించలేకపోతుంది. చూడాలిక.. ఆయనకు బ్లాక్‌ బస్టర్‌ హిట్టివ్వడానికి ఏ దర్శకుడు దిగి రావాలో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు