ఈగ 'బొద్దింక' కాదట!

ఈగ 'బొద్దింక' కాదట!

ఈగ సినిమా విడుదలయ్యాక దాని గురించి ఎన్ని కథలు పుట్టుకొచ్చాయో. అది ఫలానా సినిమాకి కాపీ అని, ఫలానా సినిమా నుంచి ఇన్ స్పయిర్ అయి తీశారని రకరకాల కథలు వినిపించాయి. అయితే ఇటీవల మరో కొత్త కథ వినిపించింది. అది... కాక్రోచ్ అనే డాక్యుమెంటరీకి కాపీ అని. ఇది వినగానే ఎక్కడ లేని కోపం వచ్చేసింది జక్కన్నకి. ఈగ తీద్దామనుకున్నప్పుడు జంతువులతో తీసిన రకరకాల సినిమాలు, డాక్యుమెంటరీలు చూశాను, అబ్జర్వ్ చేసి కథ అల్లుకున్నాను తప్ప కాపీ కొట్టలేదు, అలా పోలిస్తే నాకు చాలా కోపమొస్తుంది అంటూ మండి పడ్డాడు.

అయితే ఆయనగారి తండ్రి మాత్రం మరో కథ వినిపించాడు. చాలాకాలం క్రితం ఆయన ఓ కథ రాసుకున్నాడట. పద్దెనిమిదో శతాబ్దంలో ఓ నల్ల జాతీయుడి చుట్టూ అల్లుకున్న కథ అట అది. అప్పట్లో అమెరికాలో బానిస వ్యవస్థ ఉండేది కదా. వారి కోసం పోరాటం చేసి హీరో చనిపోతాడట. తర్వాతి జన్మలో రెక్కలతో పుడతాడట. ఎగురుతూనే తనను చంపినవాళ్ల మీద కక్ష తీర్చుకుంటాడట. దీన్ని చూసి స్ఫూర్తి పొంది ఈగ కథ రాశాడట. అంతే తప్ప, తాను కానీ, తన కొడుకు కానీ దేన్నీ కాపీ కొట్టలేదు అని చెప్పారు విజయేంద్రప్రసాద్. కానీ ఎంత చెప్పినా ఈగ కథ కాక్రోచ్ కథలానే అనిపిస్తోంది సుమండీ. అందులో హీరో చనిపోయి బొద్దింకలా పుడతాడు. ఆ రూపంతోనే తన ప్రేయసిని కలుసుకుంటాడు. తర్వాత రకరకాల మలుపులు తిరుగుతుంది కథ. ఈగ కథ కూడా అలానే ఉంటుంది కదా! ఈ తండ్రీ కొడుకులేమో కాదంటారాయె.

ఏమోలెండి... ఏ కథలో ఏ రహస్యం దాగుందో. అయినా ఈగ వచ్చింది. సక్సెస్ అయ్యింది. అవార్డులు సాధించింది. ఇన్నాళ్ల తర్వాత దాన్ని దేని ఆధారంగా తీశారు అని కూపీ లాగడం... వర్షంలో తడిసిన ఆరు నెలలకు ఆరబెట్టుకోవడం లాంటిది. సో... ఇక వదిలేద్దాం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు