బాహుబలిని మించే సినిమాలో హీరో ఫిక్స్

బాహుబలిని మించే సినిమాలో హీరో ఫిక్స్

మన ‘బాహుబలి’కి దీటైన సినిమా తీయాలని తమిళ దర్శకులు పట్టుదలతో ఉన్నారు. ఆల్రెడీ చింబు దేవన్ ‘పులి’తో ఆ ప్రయత్నం చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ సుందర్ ఆ పనిలోనే ఉన్నాడు. ఆయనైతే ‘బాహుబలి’ని మించే సినిమా తీస్తానని అంటున్నాడు. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమాకూ పెట్టనంత బడ్జెట్ ఈ సినిమా మీద పెట్టబోతున్నట్లు చెబుతున్నాడు. కాకపోతే ఈ సినిమాకు హీరో ఎవరనే విషయంలోనే చాలా తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ముందు సూర్య హీరో అన్నారు. తర్వాత విజయ్ పేరు వినిపించింది. తాజాగా జయం రవి పేరు తెరమీదికి వచ్చింది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోలుంటారట. అందులో ఒక హీరో జయం రవినే అంటున్నారు. కానీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలో జయం రవి లాంటి హీరోను పెడితే ఏమాత్రం వర్కవుట్ అవుతుందనేది సందేహం. అతడికి కొంచెం మాస్ ఇమేజ్ ఉంది కానీ.. పెద్ద స్టార్ అయితే కాదు. సూపర్ స్టార్లను పెడితే తప్ప సుందర్ అనుకుంటున్న బడ్జెట్లో సినిమా తీయడం సాధ్యం కాదు. కానీ సూర్య.. విజయ్ లాంటి హీరోలు ఈ సినిమాకు నో చెప్పేశారు. ఏడాది రెండేళ్లు సుందర్‌ను నమ్మి గంపగుత్తగా డేట్లివవ్వడానికి వాళ్లు సిద్ధంగా లేరు. మరోవైపు ఈ సినిమా కోసం మన మహేష్ బాబును కూడా గట్టిగా ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అతను కూడా అంత సుముఖంగా లేడు. స్క్రిప్టు రెడీ అయిపోయినా.. నటీనటుల సంగతే తేలక సతమతమవుతున్నాడు సుందర్. చివరికి అతను ఎవర్ని ఫైనలైజ్ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు