ఎమ్మెల్యే ప‌ద‌వికి గంటా రాజీనామా..

టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. త‌న ఎమ్మ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన గంటా శ్రీనివాసరావు.. అప్ప‌టి నుంచి త‌ట‌స్థంగా ఉంటున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ఆయన ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కొన్నాళ్లు ఆయ‌న కుమారుడిని కూడా వైసీపీలో చేర్చుతున్నార‌నే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే.. ఎందుకో.. గంటా ఎటూ నిర్ణ‌యం తీసుకోలేదు.

ఇక‌, త‌నకు టికెట్ ఇచ్చిన టీడీపీలోనూ ఆయ‌న గ‌డిచిన రెండేళ్లుగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. పార్టీ అధికారిక కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అధినేత చంద్ర‌బాబుకు కూడా అంద‌డం లేద‌ని పార్టీలోనే పెద్ద చ‌ర్చ సాగింది. ఇక‌, ఉత్త‌రాంధ్ర కాపు సామాజిక వ‌ర్గం ఏర్పాటు చేస్తున్నార‌నే ప్ర‌చారం కొన్నాళ్లు సాగింది. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే కొంద‌రు టీడీపీకి కొంద‌రు రాజీనామా చేశార‌నేది వాస్త‌వం. ఇక‌, ఇప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. ఆయ‌న చెబుతున్న‌రీజ‌న్ ఏంటంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీక‌రిస్తున్న నేప‌థ్యంలో దీనికి నిర‌స‌న‌గానే తాను,.. రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. స్పీక‌ర్ ఫార్మాట్‌లో చేసిన ఈ రాజీనామాను ఆయ‌న స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంకు కొద్ది సేప‌టి కింద‌ట పంపించారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నిల‌బెట్టుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ పార్టీల‌కు అతీతంగా రాజీనామాలు చేసి ఉద్య‌మంలో పాల్గొనాల‌ని ఆయ‌న పిలుపు నివ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రి గంటా పిలుపును ఎంత మంది అందిపుచ్చుకుంటారో చూడాలి.